LOADING...
Oil Crisis: అమెరికా ఆంక్షల ఎఫెక్ట్‌.. ఇరాన్‌కు చమురు కష్టాలు

Oil Crisis: అమెరికా ఆంక్షల ఎఫెక్ట్‌.. ఇరాన్‌కు చమురు కష్టాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2026
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్‌ జలసంధి మార్గంలో చమురు రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో ఇరాన్‌ పరిస్థితి రోజురోజుకు సంక్లిష్టంగా మారుతోంది. అమెరికా అమలు చేస్తున్న దిగ్బంధనంతో ఆ దేశం చమురును విదేశాలకు పంపలేని స్థితి ఏర్పడింది. దీంతో ఉత్పత్తి చేసిన చమురంతా దేశంలోని నిల్వ గోదాముల్లో, సముద్రంలో నిలిపిన భారీ నౌకల్లో నిల్వ చేయాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇరాన్‌కు భారీ ఆర్థిక నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో రోజుకు 18.5 లక్షల బ్యారెళ్ల చమురు ఎగుమతి చేసిన ఇరాన్‌, ప్రస్తుతం కేవలం 5.67 లక్షల బ్యారెళ్లకు పరిమితమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన ఆంక్షల ప్రభావంతో ఏ నౌక కూడా ఇరాన్‌ నుంచి చమురును ఇతర దేశాలకు తరలించలేని పరిస్థితి నెలకొంది.

వివరాలు 

ఇంధన రంగానికి దీర్ఘకాలిక నష్టం

ప్రస్తుతం ఇరాన్‌కు ఉన్న నిల్వ సామర్థ్యం కేవలం 12 నుంచి 22 రోజుల వరకే పరిమితం. నిల్వ స్థలం పూర్తిగా నిండిపోతే చమురు బావుల నుంచి ఉత్పత్తి నిలిపివేయాల్సి వస్తుంది. ఒకసారి బావులను మూసివేస్తే తిరిగి వాటి నుంచి చమురు తీయడం కష్టసాధ్యమవుతుంది. దీని వల్ల ఇంధన రంగానికి దీర్ఘకాలిక నష్టం సంభవించే ప్రమాదం ఉంది. ఇప్పటికే పరిస్థితులు విషమించడంతో ఇరాన్‌ చమురు ఉత్పత్తిని తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది.

వివరాలు 

గరిష్ట స్థాయికి దేశ చమురు నిల్వలు

రోజుకు 27.5 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి నుంచి మే మధ్య నాటికి 12 నుంచి 13 లక్షల బ్యారెళ్లకు తగ్గించే పరిస్థితి ఏర్పడుతోంది. అంటే సగానికి పైగా ఉత్పత్తి నిలిపివేయాల్సి వస్తోంది. భూమిపై ఉన్న నిల్వ ట్యాంకులు నిండిపోవడంతో ఇరాన్‌ సముద్రంలో భారీ చమురు నౌకలను నిలిపి వాటినే నిల్వ కేంద్రాలుగా వినియోగిస్తోంది. ఇప్పటికే ఆ దేశ చమురు నిల్వలు గరిష్ట స్థాయికి చేరాయి. సుమారు 185 నుంచి 195 మిలియన్‌ బ్యారెళ్ల చమురు నౌకలలోనే నిల్వ ఉంది. ఇరాన్‌ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో చమురు సముద్రంపై నిల్వ కావడం ఇదే తొలిసారి.

Advertisement