
Iran: డీల్ కావాలంటే ఖమేనీకి గౌరవం ఇవ్వాలి : ట్రంప్‌కు ఇరాన్ హితవు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei)పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ట్రంప్ వ్యాఖ్యలను టెహ్రాన్ తీవ్రంగా ఖండించింది. తమతో నిజంగా అణుఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటే ఖమేనీని మర్యాదగా సంబోధించాలని అమెరికాకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో చేసిన వ్యాఖ్యల్లో ''ఖమేనీ ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు. అతడి జీవితాన్ని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ముగించలేకపోయాయి. నేను అతడిని తీవ్ర మరణం నుంచి రక్షించాను. అయినా అతను నాకు ధన్యవాదాలు చెప్పలేదని ఆరోపించారు.
Details
అవమానించేలా వ్యవహరించరాదు
తనపై కోపం, ద్వేషంతో కూడిన ప్రకటనలు వస్తుండటంతో ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను సడలించడంపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ, ట్రంప్ ఖమేనీని అగౌరవంగా సంబోధించిన తీరును తీవ్రంగా ఖండించారు. ఇరాన్ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించరాదని హెచ్చరించారు. ట్రంప్ నిజంగా అణుఒప్పందం కోరుకుంటే తమ సుప్రీం లీడర్‌ను గౌరవంగా సంబోధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఖమేనీకి లక్షలాది మంది మద్దతుదారులున్నారని, వారిని అవమానించేలా వ్యవహరించరాదని ట్వీట్ చేశారు.
Details
చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
అలాగే ఇజ్రాయెల్‌కి ఏమీ చేయలేని స్థితి వచ్చిన తర్వాతే ట్రంప్ వద్దకు పరిగెత్తిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఖమేనీ హత్యకు పాల్పడతామంటూ అమెరికా, ఇజ్రాయెల్ బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నాయన్న ఆరోపణలపై కూడా ఇరాన్ మండిపడింది. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఉదాహరణగా నిలుస్తున్నాయని, ఇలాంటి విషయాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఐక్యరాజ్యసమితిలోని తమ శాశ్వత ప్రతినిధి విజ్ఞప్తి చేశారు.