Iran-US: ఐఆర్‌జీసీ లక్ష్యంగా అమెరికా దాడులు.. ప్రతిగా కువైట్,బహ్రెయిన్, జోర్డాన్‌లపైకి టెహ్రాన్ క్షిపణులు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. జోర్డాన్‌లో జరిగిన దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు మరణించిన ఘటనకు ప్రతీకారంగా అమెరికా తాజాగా ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. ముఖ్యంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ)కు సంబంధించిన కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. ఇరాన్ తీరప్రాంత నిఘా కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన సామర్థ్యాలు, అలాగే క్షిపణులు, డ్రోన్ల నిల్వ కేంద్రాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు తెలిపింది.
వివరాలు
అమెరికా దాడులలో డార్ఖోవిన్ అణు విద్యుత్ కేంద్రం
ఇదిలా ఉండగా,గత వారం రోజులుగా అమెరికా జరిపిన దాడుల్లో తమ దేశానికి చెందిన 50మంది ప్రాణాలు కోల్పోగా,మరో 517మంది గాయపడినట్లు ఇరాన్ అధికార వర్గాలు వెల్లడించాయి.
నిర్మాణంలో ఉన్న డార్ఖోవిన్ అణు విద్యుత్ కేంద్రం కూడా అమెరికా దాడులకు గురైనట్లు పేర్కొన్నాయి.
అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా పశ్చిమాసియాలో అమెరికా మిత్రదేశాలైన కువైట్, బహ్రెయిన్,జోర్డాన్‌లపై డ్రోన్లు,క్షిపణులతో దాడులు జరిపింది.
ఈ దాడుల్లో వచ్చిన పలువురు క్షిపణులను విజయవంతంగా అడ్డుకుని కూల్చివేసినట్లు జోర్డాన్ సైన్యం ప్రకటించింది.
మరోవైపు,తమ దేశంలోని ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో పాటు నిర్లవణీకరణ(డీసాలినేషన్) కేంద్రాన్ని కూడా ఇరాన్ మరోసారి లక్ష్యంగా చేసుకున్నట్లు కువైట్ వెల్లడించింది.
తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులపై అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి.