Iran: నౌకలు దాటితే నిప్పే.. హర్ముజ్‌పై ఇరాన్ ఘాటు హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఎగబాకుతున్న తరుణంలో.. ఇరాన్ తాజా హెచ్చరిక మరింత కలవరానికి కారణమైంది. కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని మూసివేసినట్లు ప్రకటించిన ఇరాన్, అక్కడుగా ప్రయాణించే నౌకలు దాటేందుకు యత్నిస్తే దాడి చేస్తామని స్పష్టం చేసింది. ఈ చర్యలను తమ రివల్యూషనరీ గార్డ్స్, నౌకాదళ సిబ్బంది అమలు చేస్తారని కూడా హెచ్చరించింది.
వివరాలు
ప్రపంచ ఇంధన సరఫరాకు జీవనాడి హర్ముజ్ జలసంధి
హర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు జీవనాడిలాంటిది. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పే ఉన్న ఈ సముద్ర మార్గం ద్వారా ప్రపంచం వినియోగించే చమురులో దాదాపు ఐదో వంతు రవాణా అవుతోంది. ఇక్కడ ఏర్పడే చిన్న అంతరాయం కూడా ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ మార్గం ద్వారా రవాణా అయ్యే చమురు, ఎల్‌ఎన్‌జీ ప్రధానంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్‌లకు చేరుతుంది. అంత ప్రాముఖ్యత ఉన్న ఈ జలసంధి మూసుకుపోతే రవాణా, బీమా ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్న ధరల పెరుగుదల కూడా అదే దిశగా సంకేతాలిస్తోంది.
వివరాలు
మరింత ఉత్కంఠగా మారిన అంతర్జాతీయ మార్కెట్లు
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో తమ సుప్రీం నాయకుడు ఖమేనీ మరణించడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆ పరిణామాల నేపథ్యంలోనే హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, డేటా అండ్ అనలిటిక్స్ సంస్థ కెప్లర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం సుమారు 150 ఆయిల్ ట్యాంకర్లు హర్ముజ్ జలసంధి మార్గం ద్వారా ప్రయాణించేందుకు ఇప్పటికే వేచి ఉన్నాయి. అదనంగా, తూర్పు వైపున మరో 60 ట్యాంకర్లు నిలిచిపోయాయి. గతంలో ఫిబ్రవరి మధ్యలో సైనిక విన్యాసాల కారణంగా ఇరాన్ జలసంధిలో కొంతభాగాన్ని తాత్కాలికంగా మూసివేసిన సందర్భంలో చమురు ధరలు సుమారు 6 శాతం పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూర్తిస్థాయి మూసివేత ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు మరింత ఉత్కంఠగా మారాయి.