Global Oil Crisis: ఇరాన్ యుద్ధ ప్రభావం: చమురు సరఫరా నిలిచిపోవడంతో దేశాల అత్యవసర చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ చమురు సరఫరాపై భారీ ప్రభావం పడింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20శాతం భాగం వెళ్లే కీలక మార్గమైన హర్మూజ్ జలసంధి పూర్తిగా మూసుకుపోయింది. ప్రస్తుతం ఆ మార్గంలో నౌకలు ప్రయాణించడం అంటే ప్రాణాలను పణంగా పెట్టినట్లే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో,ఏ ప్రమాదం ఎదురవుతుందో తెలియని అనిశ్చితి నెలకొనడంతో నౌకా రవాణా దాదాపు స్థంభించింది. ఇదిలా ఉండగా,పెరుగుతున్న చమురు ధరలను నియంత్రించేందుకు అమెరికా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే 172 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేస్తామని ప్రకటించిన అమెరికా, అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ)తో కలిసి ఈ విడుదల మొత్తాన్ని 400 మిలియన్ బ్యారెళ్ల వరకు పెంచే ప్రణాళికను వెల్లడించింది.
వివరాలు
ఆస్ట్రేలియాలో నిల్వల నుంచి 762 మిలియన్ లీటర్ల పెట్రోల్,డీజిల్
అయినప్పటికీ చమురు ధరలు తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ప్రపంచ దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అత్యవసర చర్యలు చేపడుతున్నాయి. ఇన్నాళ్లు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ఇతర దేశాలను ఒత్తిడి చేసిన అమెరికా ఇప్పుడు తన వైఖరిని కొంత మార్చుకుంది. ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొంత మేరకు రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకునేందుకు నిబంధనలను సడలించింది. ఆస్ట్రేలియా కూడా తన దేశంలో చమురు కొరతను తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని నిల్వల నుంచి 762 మిలియన్ లీటర్ల పెట్రోల్, డీజిల్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన కొరత తగ్గుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
వివరాలు
జపాన్‌కు సుమారు 245 రోజుల అవసరానికి సరిపడే చమురు నిల్వలు
అంతేకాదు, ఇంధన నాణ్యత ప్రమాణాలను కూడా సడలించి, అధిక సల్ఫర్ ఉన్న అన్‌లెడెడ్ పెట్రోల్ విక్రయాలకు కూడా అనుమతి ఇచ్చింది. జపాన్ కూడా తన వ్యూహాత్మక నిల్వల నుంచి 80 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేసింది. ఇది వారి వద్ద ఉన్న మొత్తం నిల్వల్లో 45 రోజుల అవసరానికి సరిపడే పరిమాణంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం జపాన్‌కు సుమారు 245 రోజుల అవసరానికి సరిపడే చమురు నిల్వలు ఉన్నాయి. దక్షిణ కొరియా కూడా చమురు ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత 30 ఏళ్లలో తొలిసారి పెట్రోల్ ధరపై పరిమితిని విధించింది. సాధారణ పెట్రోల్ ధరను లీటర్‌కు 1.17 డాలర్లుగా నిర్ణయించింది.
వివరాలు
పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ నల్లబజారుకు వెళ్లకుండా నివారించేందుకు నిత్యావసర సరకుల చట్టం అమలు
భారత్‌లో ఇప్పటికే పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ నల్లబజారుకు వెళ్లకుండా నివారించేందుకు నిత్యావసర సరకుల చట్టాన్ని అమలు చేసింది. అదనంగా వంట ఇంధనం కోసం సాధారణంగా విడుదల చేసే కిరోసిన్ కోటాకు తోడు మరో 48 వేల కిలోలీటర్లను రాష్ట్రాలకు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే హోటళ్లు, రెస్టారెంట్ల వంటి ఆతిథ్య రంగాల్లో బయోమాస్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించుకునేందుకు నెలరోజుల పాటు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
వివరాలు
పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ఇంధనాన్ని ఆదా చేసేందుకు కఠిన నిర్ణయాలు
బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఇంధన వినియోగాన్ని తగ్గించే చర్యలకు దిగింది. ప్రజలు ఎయిర్‌కండిషనర్ల వినియోగాన్ని తగ్గించాలని, అవసరం లేకపోతే లైట్లను వెంటనే ఆఫ్ చేయాలని సూచించింది. అదనంగా అవసరం లేని ప్రయాణాలను కూడా తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ఇంధనాన్ని ఆదా చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయడం, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అనుమతించడం వంటి చర్యలను అమలు చేస్తోంది.