Strait of Hormuz: హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తాం : ఇరాన్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు 47 రోజుల పాటు చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేత అనంతరం తాజాగా తిరిగి తెరుచుకుంది. దీంతో వాణిజ్య నౌకల రవాణాకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయని అంతర్జాతీయ వర్గాలు భావించాయి. అయితే ఈ సడలింపు ఎక్కువ కాలం నిలవలేదు. హర్మూజ్ జలసంధి తెరిచినప్పటికీ ఇరాన్ నౌకల రవాణాపై తమ దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటన మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ (Mohammad Ghalibaf) ఈ విషయంపై ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
అవన్నీ అసత్య ప్రచారాలే
హర్మూజ్ జలసంధి, శాంతి ఒప్పందం తదితర అంశాలపై ట్రంప్ కేవలం ఒక గంటలోనే ఏడు పోస్టులు చేశారని, అవన్నీ అసత్యాలేనని మండిపడ్డారు. దౌత్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇరాన్ అంగీకరించదని స్పష్టం చేశారు. "అబద్ధాలతో యుద్ధంలో గెలవలేరు, చర్చల్లో కూడా పురోగతి సాధించలేరు" అంటూ ట్రంప్‌పై ఘాలిబఫ్ తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో, ఇరాన్‌పై దిగ్బంధనం కొనసాగితే హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేస్తామని హెచ్చరించారు. ఇక మరోవైపు, పాకిస్థాన్ వేదికగా అమెరికాతో సోమవారం మలివిడత చర్చలు జరగనున్నాయని ఇరాన్ అధికార వర్గాలు తెలిపినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో హర్మూజ్ జలసంధి అంశం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే కీలక పరిణామంగా మారింది.