Iran: అమెరికాపై 9/11 తరహా దాడుల హెచ్చరిక.. ఉద్రిక్తత పెంచిన ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. పరస్పర హెచ్చరికలు, దాడులు, అధికారిక ప్రకటనలతో ఇరు దేశాల మధ్య ఘర్షణలు కొత్త మలుపు తిరిగాయి. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఏ నౌకపై దాడి చేసినా, ప్రతిస్పందనగా ఆ దేశంలోని వంతెనలు లేదా విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు నిర్వహిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తీవ్రంగా స్పందించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే అమెరికా 2001 సెప్టెంబర్ 11 దాడులను తలపించే ఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే అమెరికా మరోసారి జాతీయ సంతాప దినాలు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించింది.
వివరాలు
సెప్టెంబర్ 11 అమెరికా దేశ చరిత్రలో అత్యంత విషాదకర ఘటన
ఈ వివరాలను ఇరాన్ ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ తస్నిమ్ వెల్లడించింది.
2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన ఉగ్రదాడులు ఆ దేశ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా నిలిచాయి.
అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన 19మంది నలుగు బృందాలుగా విడిపోయి నాలుగు ప్రయాణికుల విమానాలను హైజాక్ చేశారు.
వాటిలో రెండు విమానాలను న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌పై ఢీకొట్టగా,మరో విమానం పెంటగాన్‌ను లక్ష్యంగా చేసుకుంది.
నాలుగో విమానం పెన్సిల్వేనియాలో కూలిపోయింది.ఈ దాడుల్లో మొత్తం 2,996 మంది ప్రాణాలు కోల్పోగా,దాదాపు 25వేల మంది గాయపడ్డారు.
ఆ ఘటన తర్వాత అమెరికా జాతీయ సంతాప దినాలను ప్రకటించింది.
అదే ఘటనను ప్రస్తావిస్తూ ఇరాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
వివరాలు
"మేం చమురు అమ్మకపోతే.. మరెవరూ అమ్మలేరు"
ఇదిలా ఉండగా,హర్మూజ్ జలసంధి భద్రతపై కూడా ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది.
అమెరికా సైనిక బలగాలు హర్మూజ్ ప్రాంతానికి దూరంగా ఉంటేనే ఆ జలసంధి సురక్షితంగా ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
తాము చమురు ఎగుమతి చేయలేని పరిస్థితి వస్తే,ఇతర దేశాలు కూడా చమురును విక్రయించలేవని ఆయన వ్యాఖ్యానించారు.
హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేపట్టిన దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరాయి.
దాదాపు 12రోజులుగా కొనసాగుతున్నఈ ఘర్షణలపై అమెరికా కూడా స్పందించింది.
టెహ్రాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరిచే లక్ష్యంతో కీలక దాడులు నిర్వహించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
దీంతో పశ్చిమాసియాలో భద్రతాపరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి.