LOADING...
Iran: ఎర్ర సముద్రంలో అమెరికా క్యారియర్‌ గ్రూప్‌ కదలికలు.. సపోర్ట్‌ సంస్థలను టార్గెట్‌ చేస్తామన్న ఇరాన్
సపోర్ట్‌ సంస్థలను టార్గెట్‌ చేస్తామన్న ఇరాన్

Iran: ఎర్ర సముద్రంలో అమెరికా క్యారియర్‌ గ్రూప్‌ కదలికలు.. సపోర్ట్‌ సంస్థలను టార్గెట్‌ చేస్తామన్న ఇరాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 16, 2026
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్తంగా కొనసాగిస్తున్న ఆపరేషన్‌లో అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యుఎస్‌ఎస్‌ జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ ఎర్ర సముద్ర ప్రాంతంలో తన పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నౌకకు మద్దతు అందిస్తున్న లాజిస్టిక్స్‌, సేవా కేంద్రాలపై ఇరాన్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ క్యారియర్‌ గ్రూప్‌కు సపోర్ట్‌ సెంటర్లుగా పని చేస్తున్న సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఇరాన్‌ ప్రభుత్వ ఆధీనంలోని ప్రెస్‌టీవీ విడుదల చేసింది.

వివరాలు 

యుద్ధ చర్యల ప్రారంభానికి ముందు పశ్చిమాసియా వైపుకు జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ నౌక

ఇరాన్‌పై యుద్ధ చర్యలు ప్రారంభం కావడానికి ముందు జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ నౌక కరేబియన్‌ సముద్రం నుంచి పశ్చిమాసియా వైపు కదిలింది. దాడులు మొదలైన తర్వాత సూయజ్‌ కాలువ దాటి ఎర్ర సముద్రంలోకి చేరింది. ప్రస్తుతం ఈ నౌక ఎర్ర సముద్రం నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా పోర్టు దిశగా ప్రయాణిస్తున్నట్లు చైనా వాణిజ్య జియోస్పేషియల్‌ సంస్థ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ఇరాన్‌కు ఇది నేరుగా ముప్పుగా మారే అవకాశం ఉండటంతోనే ఈ హెచ్చరికాత్మక ప్రకటన విడుదలైనట్లు అధికారులు తెలిపారు.

వివరాలు 

ఇరాన్‌ సరిహద్దుల పరిధిలోకి వచ్చిన వెంటనే దాడులకు సిద్ధం

అమెరికా విమాన వాహక నౌక కదలికలను ఇరాన్‌ బలగాలు నిరంతరం గమనిస్తున్నాయని ఐఆర్‌జీసీ అధికారులు వెల్లడించారు. ఆ నౌక ఇరాన్‌ సరిహద్దుల పరిధిలోకి వచ్చిన వెంటనే దాడులకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. అలాగే అమెరికాకు చెందిన మరో విమాన వాహక నౌక అబ్రహాం లింకన్‌పై ఇటీవల తాము దాడి చేశామని, దాంతో అది గల్ఫ్‌ జలాల ప్రాంతం నుంచి వెనుదిరిగిందని కూడా పేర్కొన్నారు.

Advertisement