Loading...
Ukraine-Iran: కాస్పియన్ సముద్రంలో ఇరాన్ నౌకపై దాడి.. ఉక్రెయిన్‌కు టెహ్రాన్ హెచ్చరిక
కాస్పియన్ సముద్రంలో ఇరాన్ నౌకపై దాడి.. ఉక్రెయిన్‌కు టెహ్రాన్ హెచ్చరిక

Ukraine-Iran: కాస్పియన్ సముద్రంలో ఇరాన్ నౌకపై దాడి.. ఉక్రెయిన్‌కు టెహ్రాన్ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 27, 2026
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాస్పియన్ సముద్రంలో ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ జరిపిన దాడిలో ఓ నావికుడు మృతిచెందగా, మరో నావికుడు గాయపడినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ ఘటనపై టెహ్రాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ దేశ ప్రయోజనాలు, ఆస్తుల రక్షణ విషయంలో ఎలాంటి చర్యకైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది. ఈ దాడికి బాధ్యులైన ఉక్రెయిన్ తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత విస్తరించకుండా ఉండాలంటే కీవ్ చర్యలను నియంత్రించాలని ఐరోపా దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి చేసింది.

వివరాలు 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తమకు ఎలాంటి పాత్ర లేదని ఇరాన్ స్పష్టం

పశ్చిమాసియాలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తమకు ఎలాంటి పాత్ర లేదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది.

అయితే రష్యా నుంచి ఉపగ్రహ సమాచారాన్ని ఇరాన్ అందుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు.

గల్ఫ్ దేశాలు, అమెరికా సైనిక స్థావరాలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను రష్యా సేకరించి ఇరాన్‌కు అందిస్తోందని, వాటిని ఇరాన్ తన సైనిక చర్యల్లో వినియోగిస్తోందని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

కాస్పియన్ సముద్ర మార్గం ప్రస్తుతం ఇరాన్‌కు అత్యంత కీలకమైన వాణిజ్య మార్గం

అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో కాస్పియన్ సముద్ర మార్గం ప్రస్తుతం ఇరాన్‌కు అత్యంత కీలకమైన వాణిజ్య మార్గంగా మారింది.

ఉత్తర దిశలోని ఈ సముద్ర మార్గం ద్వారా చైనా సహా పలు దేశాల నుంచి వస్తువులు ఇరాన్‌కు చేరుతున్నాయి.

అలాంటి కీలక వాణిజ్య మార్గంలో ఇరాన్ నౌకపై ఉక్రెయిన్ దాడి జరగడం వ్యూహాత్మకంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా,ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా ఆదివారం తెల్లవారుజామున భారీ స్థాయిలో క్షిపణులు,డ్రోన్లతో దాడులు చేసింది.

మొత్తం ఏడు బాలిస్టిక్ క్షిపణులు,136 డ్రోన్లను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది.

కీవ్‌తో పాటు చెర్నిహివ్,ఖార్కివ్ తదితర నగరాలు కూడా ఈ దాడులకు గురయ్యాయి.

ఈ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా,పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

ADVERTISEMENT