Trump: ట్రంప్ అల్టిమేటం.. అమెరికాకు ఇరాన్ కౌంటర్ హెచ్చరిక..
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చుతోంది. శాంతి చర్చలు నిలిచిపోయిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మరో రెండు మూడు రోజుల్లో శాంతి ఒప్పందంపై ముందడుగు పడకపోతే తిరిగి దాడులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో మంగళవారం చేపట్టాల్సిన దాడిని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు వెల్లడించారు. అయితే ఇరాన్ వైఖరిలో మార్పు లేకుంటే వారాంతంలోనే మళ్లీ దాడులు తప్పవని సంకేతాలిచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి తీవ్రంగా స్పందించారు. అమెరికా మరోసారి యుద్ధానికి దిగితే తాము కూడా గట్టిగానే ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.
వివరాలు
యుద్ధంలో అమెరికాకు నష్టాలు
గతంలో కంటే ఈసారి మరింత అనూహ్యమైన దాడులు ఎదురవుతాయని పేర్కొన్నారు. అమెరికా అందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇరాన్ తొలిసారిగా అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చివేసిందని అరగ్చి పేర్కొన్నారు. యుద్ధంలో అమెరికాకు జరిగిన నష్టాలు అమెరికా కాంగ్రెస్ పరిశోధనా విభాగం నివేదికలోనే వెల్లడయ్యాయని గుర్తుచేశారు. అరగ్చి ప్రస్తావించిన "సర్‌ప్రైజ్‌స్"పై అంతర్జాతీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటివరకు ఇరాన్ అమలు చేసిన వ్యూహాలను పరిశీలిస్తే పలు రకాల దాడుల అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
డ్రోన్ దాడుల ముప్పు
ఇప్పటికే అమెరికాకు చెందిన ఎంఖ్యూ-9 రీపర్ డ్రోన్లను ఇరాన్ కూల్చివేసింది. భవిష్యత్తులో గుంపులుగా దూసుకొచ్చే అత్యాధునిక డ్రోన్లతో పెద్దఎత్తున దాడులు జరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ గతంలో క్షిపణి దాడులు చేసింది. ఆ దాడుల్లో కే.సీ-135 ట్యాంకర్లు, ఈ-3 గగన నిఘా విమానాలు దెబ్బతిన్నాయి. ఇదే తరహా దీర్ఘశ్రేణి క్షిపణి దాడులు మళ్లీ జరగవచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికా సమాచార వ్యవస్థలపై గతంలోనూ ఇరాన్ అంతర్జాల దాడులు నిర్వహించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. కొత్త యుద్ధం ప్రారంభమైతే ఈ రంగంలో మరింత తీవ్ర దాడులు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
చమురు రవాణాపై ప్రభావం
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో అనేక దేశాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త ఆయుధాల వినియోగం? అరగ్చి ప్రస్తావించిన "సర్‌ప్రైజ్‌లు"లో ఇప్పటివరకు బయటపడని యుద్ధ సాంకేతికత లేదా కొత్త రకం ఆయుధాల వినియోగం ఉండొచ్చని అంతర్జాతీయ రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వివరాలు
కొత్త ఆయుధాల వినియోగం?
అమెరికా కాంగ్రెస్ పరిశోధనా విభాగం నివేదిక ప్రకారం ఈ యుద్ధంలో అమెరికా భారీ నష్టాలు చవిచూసింది. ఇప్పటివరకు కనీసం 42 సైనిక విమానాలు కోల్పోయినట్లు నివేదిక వెల్లడించింది. వీటిలో 24 ఎంఖ్యూ-9 రీపర్ డ్రోన్లు, నాలుగు ఎఫ్-15ఈ యుద్ధ విమానాలు, ఒక ఏ-10 దాడి విమానం, రెండు ఎంసీ-130జే ప్రత్యేక ఆపరేషన్ విమానాలు, ఒక కే.సీ-135 ట్యాంకర్, ఒక ఎంఖ్యూ-4సీ ట్రిటాన్ డ్రోన్ ఉన్నాయి. అదనంగా ఎఫ్-35ఏ యుద్ధవిమానం, ఈ-3 సెంట్రీ గగన నిఘా విమానం, హెచ్‌హెచ్-60డబ్ల్యూ హెలికాప్టర్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. అమెరికా రక్షణ శాఖ అంచనా ప్రకారం ఇప్పటివరకు ఈ యుద్ధం వల్ల అమెరికాకు దాదాపు 29 బిలియన్ డాలర్ల వ్యయం జరిగినట్లు సమాచారం.
వివరాలు
మిత్ర దేశాల మద్దతుతో ప్రతిదాడులకు దిగిన ఇరాన్
2026 ఫిబ్రవరి 28న "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" పేరుతో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. దీనికి ప్రతిగా ఇరాన్ తన మిత్ర దేశాల మద్దతుతో ప్రతిదాడులకు దిగింది. అనంతరం ఏప్రిల్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించడంతో పాటు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు ప్రారంభమయ్యాయి. దీంతో యుద్ధం ముగిసే అవకాశాలున్నాయని భావించారు. అయితే శాంతి చర్చలు మధ్యలోనే నిలిచిపోయాయి. కొంతకాలం యుద్ధ తీవ్రత తగ్గినప్పటికీ ఇప్పుడు మళ్లీ ఇరు దేశాల హెచ్చరికలు, కవ్వింపు చర్యలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ట్రంప్ తాజా అల్టిమేటం, ఇరాన్ ప్రతిస్పందనతో మరోసారి పశ్చిమాసియాలో యుద్ధ ముప్పు పెరిగిందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.