Iran Attacks US Bases: బహ్రెయిన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు.. హర్మూజ్‌లో ట్యాంకర్లపై దాడి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలైన అల్-రిఫా, అవాలిలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. అమెరికా దురాక్రమణకు, తమ గగనతలాన్ని పదేపదే ఉల్లంఘిస్తున్నందుకు ప్రతీకారంగానే ఈ దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. అయితే ఈ దాడులపై బహ్రెయిన్ మరో వివరాన్ని వెల్లడించింది. తమ దేశంలోని పౌర పారిశ్రామిక కేంద్రంపై దాడి జరగడంతో అక్కడ మంటలు చెలరేగాయని తెలిపింది. పలు డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని పేర్కొంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
వివరాలు
దౌత్య చర్చలను ముమ్మరం చేయాలి..
యుద్ధాన్ని ముగించేందుకు కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కోరారు.
పశ్చిమాసియాలో అమెరికా కొనసాగిస్తున్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లను పరిష్కరించే వరకు హర్మూజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ కూడా తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది.
ఇందులో భాగంగా ఖతార్ ప్రతినిధుల బృందం శనివారం టెహ్రాన్‌ను సందర్శించి ఇరాన్ అధికారులతో చర్చలు జరిపింది.
యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య మార్గాలను అన్వేషిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
హర్మూజ్ జలసంధిలో రెండు ట్యాంకర్లపై దాడి..
మరోవైపు శనివారం హర్మూజ్ జలసంధి ప్రాంతంలో రెండు ట్యాంకర్లపై దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) వెల్లడించింది.
ఈ నౌకలపై గుర్తుతెలియని ప్రాజెక్టైళ్లతో దాడులు జరిగినట్లు తెలిపింది.
మరో నౌక అనధికార మార్గంలో ప్రయాణిస్తూ సముద్రంలో ఏర్పాటు చేసిన మైన్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం.
ఈ పరిణామాలతో కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు, భద్రతపై ఆందోళనలు మరింత పెరిగాయి.