Iranian Delegation: పాకిస్తాన్ పర్యటనలో దాడి బెదిరింపులు.. ఇరాన్ ప్రతినిధుల సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ పర్యటనలో భాగంగా ఇస్లామాబాద్‌కు వెళ్లిన ఇరాన్ ప్రతినిధుల బృందానికి దాడి బెదిరింపులు వచ్చాయని వారు వెల్లడించారు. అమెరికాతో శాంతి చర్చలు విఫలమైన తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలిపారు. ఈ బృందంలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్-బాఘేర్ ఘలిబాఫ్ కూడా ఉన్నారు. రాజకీయ విశ్లేషకుడు మహమ్మద్ మరాండి మాట్లాడుతూ, భద్రతా కారణాల వల్ల మధ్యలోనే విమానం మార్చి, టెహ్రాన్‌కు భూభాగ మార్గంలో ప్రయాణించామని చెప్పారు.
వివరాలు
మష్హాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయినా విమానం
ఇస్లామాబాద్‌కు వెళ్తున్న సమయంలోనే తమ విమానంపై దాడి జరిగే అవకాశం ఉందని నేరుగా హెచ్చరికలు వచ్చాయని ఆయన తెలిపారు. దీంతో తిరుగు ప్రయాణంలో రహస్యంగా విమానం మార్చుకున్నామని చెప్పారు. ఆ తర్వాత ఆ విమానం మష్హాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిందని, అక్కడి నుంచి రైలు, బస్సుల ద్వారా టెహ్రాన్ చేరుకున్నామని వివరించారు. అమెరికాపై తమకు విశ్వాసం లేదని, ఒకవైపు చర్చలు జరుపుతూనే యుద్ధానికి సిద్ధమవుతున్నామని మరాండి వ్యాఖ్యానించారు. అమెరికా ఎప్పటికీ మోసపూరితంగా వ్యవహరిస్తుందని, అందుకే తమ సైనిక శక్తిని పెంచుకుంటున్నామని అన్నారు. చర్చలు విఫలమైనప్పటికీ, మళ్లీ చర్చలు ప్రారంభించేందుకు రహస్యంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
వివరాలు
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇది అత్యున్నత స్థాయి సమావేశం
ఈ వారం చివర్లో లేదా వచ్చే వారం ప్రారంభంలో ఇరాన్,పాకిస్తాన్ ప్రతినిధులు మళ్లీ ఇస్లామాబాద్‌లో సమావేశం కావచ్చని సమాచారం. రెండో విడత చర్చలకు ఇరాన్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని పాకిస్తాన్ అధికారులు తెలిపారు. అయితే అమెరికా ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు.దాదాపు పదేళ్ల తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన ఈప్రత్యక్ష చర్చలు కీలకంగా భావించినప్పటికీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇది అత్యున్నత స్థాయి సమావేశంగా గుర్తింపు పొందింది. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత జరిగిన ఈ చర్చల్లో యురేనియం శుద్ధి అంశం ప్రధాన అడ్డంకిగా మారింది. అమెరికా 20 సంవత్సరాల పాటు ఆ ప్రక్రియను నిలిపివేయాలని కోరగా,ఇరాన్ మాత్రం ఐదు సంవత్సరాలకు మాత్రమే అంగీకరించిందని సమాచారం.