Iran: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ రాజీనామా..? అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియన్ రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడటం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) వ్యవహార శైలిపై అసంతృప్తితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తన రాజీనామా లేఖను సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి పంపినట్లు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఓ ఇరాన్ పత్రిక పేర్కొంది.
వివరాలు
కథనంలో ఏముంది..?
ఆ పత్రిక కథనం ప్రకారం, ఇరాన్ పాలనా వ్యవస్థ క్రమంగా ఐఆర్‌జీసీ కమాండర్ల ఆధీనంలోకి వెళ్తోందని పెజష్కియన్ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కీలక నిర్ణయాల ప్రక్రియలో ప్రభుత్వ అధికారులను పక్కన పెడుతున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాజ్యాంగం, చట్టాల ప్రకారం తనకు ఉన్న అధికారాలు, బాధ్యతలను కూడా పూర్తి స్థాయిలో నిర్వర్తించనివ్వడం లేదని ఆయన ఆరోపించినట్లు కథనంలో వెల్లడించింది. అయితే ఆయన సమర్పించిన రాజీనామా లేఖపై సుప్రీం లీడర్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచినట్లు పేర్కొంది.
వివరాలు
ప్రచారాన్ని ఖండించిన అధ్యక్ష కార్యాలయం
ఇక ఈ వార్తలపై ఇరాన్ అధ్యక్ష కార్యాలయం స్పందించింది. అధ్యక్ష కార్యాలయంలోని కమ్యూనికేషన్స్ విభాగం డిప్యూటీ హెడ్ మెహదీ తబాతబాయి మాట్లాడుతూ, అమెరికాతో కీలక చర్చలు జరుగుతున్న సమయంలో కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ నివేదికలకు వాస్తవ ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తుర్కియే ప్రభుత్వ ఆధ్వర్యంలోని పత్రిక కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ ప్రచారాన్ని ఖండించింది.
వివరాలు
శాంతి ఒప్పంద ప్రతిపాదనలు వెనక్కి పంపిన ట్రంప్
మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై కూడా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజా ఒప్పంద ముసాయిదాలో 60 రోజుల కాల్పుల విరమణతో పాటు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి చర్యలు చేపట్టే అంశాలు ఉన్నట్లు సమాచారం. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని మార్పులు కోరినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాల తయారీ కార్యక్రమాన్ని పూర్తిగా విరమించుకోవాలనే అంశంపై ఆయన కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధికి సంబంధించిన నిబంధనల్లో కూడా కొన్ని సవరణలు కోరినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందం కుదుర్చుకోవడంలో అమెరికా ఎలాంటి తొందరలో లేదని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు.
వివరాలు
ఒప్పంద ప్రతిపాదనలపై స్పందించిన ఇరాన్ పార్లమెంట్ స్పీకర్
శాంతి ఒప్పంద ప్రతిపాదనలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ స్పందించారు. దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడని ఎలాంటి ఒప్పందాన్నీ ఇరాన్ అంగీకరించబోదని స్పష్టం చేశారు. జాతీయ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన పేర్కొన్నారు.