LOADING...
Iran Warns:అమెరికాలో 9 /11 అల్-ఖైదా ఉగ్రదాడులు.. ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌తో ట్రంప్ యంత్రాంగం కుట్ర.. ఇరాన్ ఆరోపణలు 
ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌తో ట్రంప్ యంత్రాంగం కుట్ర.. ఇరాన్ ఆరోపణలు

Iran Warns:అమెరికాలో 9 /11 అల్-ఖైదా ఉగ్రదాడులు.. ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌తో ట్రంప్ యంత్రాంగం కుట్ర.. ఇరాన్ ఆరోపణలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 16, 2026
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్-అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. భవిష్యత్తులో జరిగే భారీ ఉగ్రదాడికి ఇరాన్‌ను బాధ్యులుగా చూపించేలా అమెరికా కుట్ర పన్నే అవకాశం ఉందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీ హెచ్చరించారు. ఈ కుట్రలో ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌లో మిగిలి ఉన్న కొందరి సహకారం కూడా ఉందని ఆయన ఆరోపించారు. అలీ లరిజానీ మాట్లాడుతూ.. ''ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌లో ఇంకా మిగిలి ఉన్న వ్యక్తులు 9/11 తరహాలో ఒక సంఘటన సృష్టించి, దానికి ఇరాన్‌ను బాధ్యులుగా నిలబెట్టే కుట్ర చేస్తున్నారనే సమాచారం విన్నాను. అయితే అలాంటి ఉగ్రదాడులను ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదు. మా పోరు అమెరికా ప్రజలతో కాదు'' అని స్పష్టం చేశారు.

వివరాలు 

యుద్ధంలో 2 వేల మందికి పైగా మృతి 

ఇదిలా ఉండగా, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో గత నెల 28న ఇరాన్‌పై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత తీవ్రమైంది. ప్రతీకార చర్యల్లో భాగంగా ఇరాన్.. ఇజ్రాయెల్ లక్ష్యాలతో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై కూడా దాడులకు ప్రయత్నించినట్టు సమాచారం. ఇప్పటివరకు ఈ యుద్ధంలో 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. వీరిలో అత్యధికులు ఇరాన్ పౌరులేనని నివేదికలు చెబుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 15 వేలకుపైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్-అమెరికా బలగాలు దాడులు జరిపినట్టు పెంటగాన్ ప్రకటించినట్లు సమాచారం.

వివరాలు 

9/11 ఉగ్రదాడి

అలాగే, దాదాపు 2,500 మంది నావికులతో కూడిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక యూఎస్‌ఎస్ ట్రిపోలీని గల్ఫ్ ప్రాంతంలో మోహరించినట్టు అమెరికా మీడియా నివేదించింది. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన ఉగ్రదాడి ఆధునిక చరిత్రలోనే అత్యంత ఘోర సంఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఈ దాడుల్లో దాదాపు 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నాలుగు అమెరికా విమానాలను హైజాక్ చేసిన 19 మంది అల్‌-ఖైదా ఉగ్రవాదులు.. రెండు విమానాలతో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై, మరో విమానంతో వాషింగ్టన్ డీసీలోని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌పై వరుస దాడులు చేశారు.

Advertisement

వివరాలు 

9/11 ఉగ్రదాడి

నాలుగో విమానం యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 93. ఇందులోని ప్రయాణికులు హైజాకర్లకు ప్రతిఘటించడంతో అది పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్లే సమీపంలోని ఓ పొలంలో కూలిపోయింది. ఈ విమానాన్ని అమెరికా క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి ఉపయోగించాలని హైజాకర్లు భావించినట్టు విశ్వసిస్తున్నారు.

Advertisement