Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం.. ఏ ఏ దేశాల నేతలు వస్తున్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ మాజీ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ అనుబంధ ప్రసార సంస్థ ఐఆర్‌ఐబీ తెలిపిన వివరాల ప్రకారం,ప్రపంచవ్యాప్తంగా 100కిపైగా దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో 86 ఏళ్ల వయసులో ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. మార్చిలోనే అంత్యక్రియలు నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ, ఇరాన్‌పై కొనసాగిన యుద్ధ పరిస్థితుల కారణంగా అవి వాయిదా పడ్డాయి. ఇప్పుడు టెహ్రాన్‌లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు మొత్తం ఏడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇరాన్‌తో పాటు ఇరాక్‌లోని పలు నగరాల్లో మతపరమైన కార్యక్రమాలు, అంతిమయాత్రలు నిర్వహించనున్నారు. విదేశీ దేశాల ప్రతినిధులు ఎక్కువగా శుక్రవారం జరిగే ప్రధాన కార్యక్రమానికి హాజరవుతారు.
వివరాలు
క్వోమ్ నగరానికి అంతిమయాత్ర
శనివారం,ఆదివారం టెహ్రాన్‌లో ప్రజల సందర్శన కోసం ఖమేనీ భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాలతో కలిసి ఇరాన్‌లోని అతిపెద్ద ప్రార్థనా కేంద్రాల్లో ఒకటైన గ్రాండ్ మొసల్లాలో ఉంచనున్నారు. అనంతరం సోమ,మంగళవారాల్లో అంతిమయాత్ర క్వోమ్ నగరానికి చేరుకోనుంది. బుధవారం ఇరాక్‌లోని నజఫ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం నజఫ్, కర్బలా నగరాల్లో ప్రజా అంతిమయాత్రలు కొనసాగుతాయి. చివరిగా వచ్చే శుక్రవారం ఖమేనీ స్వస్థలమైన మష్హాద్‌లోని ఇమామ్ రెజా దర్గా వద్ద అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఖమేనీ అంత్యక్రియలకు పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ హాజరుకానున్నారు. తజికిస్తాన్ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మోన్, ఆర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్, జార్జియా అధ్యక్షుడు మిఖెయిల్ కవెలష్విలి కూడా కార్యక్రమంలో పాల్గొంటారు.
వివరాలు
అంత్యక్రియలకు హాజరవుతున్న దేశాలు ఇవే..
టర్కీ ఉపాధ్యక్షుడు జెవ్డెట్ యిల్మాజ్,చైనా జాతీయ ప్రజా కాంగ్రెస్ స్థాయి కమిటీ ఉపాధ్యక్షుడు హె వెయ్,రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు,మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ కూడా అంత్యక్రియలకు హాజరవుతున్నట్లు ఆయా దేశాలు ధృవీకరించాయి. భారత్ తరఫున బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా ఇరాన్‌కు వెళ్లనున్నారు. మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా భారత ప్రతినిధి బృందంలో ఉన్నారు. అఫ్గానిస్థాన్ తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో పాటు ఉప ప్రధాని అబ్దుల్ ఘనీ బరాదర్ కూడా హాజరవుతున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ హఫీజుద్దీన్ అహ్మద్ కూడా కార్యక్రమంలో పాల్గొననున్నారు.
వివరాలు
అయతొల్లా రుహొల్లా ఖొమేనీ అంత్యక్రియలకు కోటి మంది
ఈ అంత్యక్రియలు ఆధునిక చరిత్రలోనే అత్యంత భారీ ప్రజా అంత్యక్రియల్లో ఒకటిగా నిలుస్తాయని అంచనా వేస్తున్నారు. 1989లో మాజీ సుప్రీం నేత అయతొల్లా రుహొల్లా ఖొమేనీ అంత్యక్రియలకు దాదాపు కోటి మంది హాజరైన రికార్డును కూడా ఇది అధిగమించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుత ఇరాన్ సుప్రీం నేత, ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ఆయన ప్రతినిధి తెలిపారు.
వివరాలు
తండ్రి అంత్యక్రియలకు మొజ్తబా దూరం
ఇజ్రాయెల్ నుంచి భద్రతాపరమైన ముప్పు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు, ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అమెరికా, ఇజ్రాయెల్ ఎలాంటి సైనిక చర్యలకు పాల్పడవద్దని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. తమ దేశంపై దాడి లేదా బెదిరింపులు జరిగితే సాయుధ బలగాలు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తాయని ఖతమ్ అల్-అన్బియా కేంద్ర ప్రధాన కార్యాలయ కమాండర్ అలీ అబ్దొల్లాహీ స్పష్టం చేశారు.