LOADING...
Strait of Hormuz: హర్మూజ్ జలసంధిపై ఐఆర్‌జీసీ కఠిన ఆదేశాలు.. అనుమతి లేకుండా ప్రయాణం నిషేధం!
హర్మూజ్ జలసంధిపై ఐఆర్‌జీసీ కఠిన ఆదేశాలు.. అనుమతి లేకుండా ప్రయాణం నిషేధం!

Strait of Hormuz: హర్మూజ్ జలసంధిపై ఐఆర్‌జీసీ కఠిన ఆదేశాలు.. అనుమతి లేకుండా ప్రయాణం నిషేధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 19, 2026
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ ఓడరేవులపై విధించిన దిగ్బంధాన్ని ఎత్తివేసే వరకు హర్ముజ్ జలసంధిని మూసివేసే ఉంచుతామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌ (ఐఆర్‌జీసీ) స్పష్టం చేసింది. అమెరికా యుద్ధ విరమణ ఒప్పంద షరతులను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలకు ఎలాంటి విశ్వసనీయత లేదని మండిపడింది. అమెరికా చర్యల వల్లే మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసివేయాల్సి వచ్చిందని తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి ద్వారా తమ అనుమతి లేకుండా ఏ నౌక కూడా ప్రయాణించకూడదని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. తమ నిబంధనలు ఉల్లంఘించే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది. నౌకలు, వాటి యజమానులు ఇరాన్ నుంచి వచ్చే సూచనల ప్రకారమే ముందుకు సాగాలని తెలిపింది.

వివరాలు

తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం

ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకలకు తెరిచామని ప్రకటించిన కొద్ది సమయంలోనే ఇరాన్ మళ్లీ దానిని మూసివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. హర్మూజ్ దాటేందుకు ప్రయత్నించిన భారత నౌకలపై ఇరాన్ నౌకాదళం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ దేశంలోని ఇరాన్ రాయబారికి నోటీసులు జారీ చేసింది. జలసంధి తెరిచామని ప్రకటించిన 24 గంటలు కూడా గడవకముందే తిరిగి మూసివేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది.

వివరాలు

రెండు నౌకలు వెనక్కి వెళ్లినట్లు సమాచారం

ఈ సమయంలో హర్మూజ్ మార్గం గుండా ప్రయాణించేందుకు "జగ్ అర్ణవ్", "సాన్మర్ హెరాల్డ్" అనే రెండు భారత నౌకలు ప్రయత్నించాయి. వాటిలో "జగ్ అర్ణవ్"పై ఇరాన్ నౌకాదళం కాల్పులు జరిపింది. ఒమన్ ఉత్తర దిశలో ఉన్న హర్మూజ్ జలసంధి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. అయితే ఈ ఘటనతో భయాందోళనకు గురైన రెండు నౌకలు తిరిగి వెనక్కి మళ్లినట్లు సమాచారం. ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement