Mojtaba Khamenei: మొజ్తాబా ఖమేనీ ఎక్కడ? ఆరోగ్యంపై అనుమానాల వేళ ఇరాన్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడుతుందా? ఆయన కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, తాజా దృశ్యాలు పెద్దగా బయటకు రాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మొజ్తాబా ఖమేనీకి సంబంధించిన మరిన్ని వీడియోలు, ఫొటోలను త్వరలో విడుదల చేస్తామని వెల్లడించింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది.
వివరాలు
అసలు ఏం జరుగుతోంది?
తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత మార్చిలో ఇరాన్ అత్యున్నత నాయకుడిగా మొజ్తాబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించారు.
అయితే అప్పటి నుంచి ఆయన బహిరంగ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించలేదు.
ఆయనకు సంబంధించిన స్పష్టమైన, తాజా దృశ్యాలు అందుబాటులో లేకపోవడంతో ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి.
ఇదే సమయంలో ఇజ్రాయెల్ మీడియా కూడా మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందంటూ ఇటీవల కథనాలు ప్రచురించింది.
ఈ పరిణామాల మధ్య ఇరాన్ ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
'త్వరలో మరిన్ని వీడియోలు విడుదల చేస్తాం'
బసీజ్ ఆర్గనైజేషన్ డిప్యూటీ అధికారి ఖాసెమ్ ఖొరైషీ కీలక వ్యాఖ్యలు చేశారు.
మొజ్తాబా ఖమేనీ ప్రజల్లో ఉన్న దృశ్యాలతో పాటు ఆయన వీధుల్లో పర్యటిస్తున్న వీడియోలు, సాయుధ దళాల కమాండర్లతో సమావేశమైన సందర్భాలకు సంబంధించిన దృశ్యాలను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.
ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న అనుమానాలు, విమర్శలకు సమాధానం ఇచ్చే ఉద్దేశంతోనే ఈ దృశ్యాలను ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
దీంతో కొత్తగా విడుదలయ్యే వీడియోలపై ఆసక్తి నెలకొంది.
వివరాలు
ఆగస్టు 9న ఓ వీడియో విడుదల
ఇరాన్‌కు చెందిన సెమీ-అధికారిక మెహర్ న్యూస్ ఏజెన్సీ ఆగస్టు 9న మొజ్తాబా ఖమేనీకి సంబంధించిన ఓ వీడియోను ఇప్పటికే విడుదల చేసింది.
అయితే ఆ వీడియోను ఎప్పుడు చిత్రీకరించారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఆ వీడియోలో ఖమేనీ తన అనుచరులతో మాట్లాడుతున్నట్లు కనిపించారు.
ఆయన ఆరోగ్యంగానే ఉన్నారనే సందేశాన్ని ప్రజలకు అందించడమే ఆ వీడియో ఉద్దేశంగా కనిపించింది.
అయితే చిత్రీకరణ తేదీపై స్పష్టత లేకపోవడంతో దీనిపై కూడా చర్చ కొనసాగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆగస్టు 9న మొజ్తాబా ఖమేనీకి సంబంధించిన ఓ వీడియో
Iran’s Mehr RELEASES VIDEO of Supreme Leader Mojtaba Khamenei for ‘FIRST TIME’ pic.twitter.com/v3Rp81VfLH
— RT (@RT_com) August 8, 2026
వివరాలు
భిన్నంగా స్పందించిన ఇరాన్ అధ్యక్షుడు
మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఖమేనీ ఆరోగ్యంపై ఆసక్తిని మరింత పెంచాయి.
జూలై 21న ఆయన మొజ్తాబా ఖమేనీతో తన సంప్రదింపులు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు.
అయితే ఆగస్టు ప్రారంభంలో మాత్రం ఖమేనీతో కమ్యూనికేషన్ చాలా కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు.
పెజెష్కియన్ చేసిన ఈ రెండు భిన్న వ్యాఖ్యలు.. మొజ్తాబా ఖమేనీ వాస్తవంగా ప్రభుత్వ వ్యవహారాల్లో ఎంత చురుకుగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలను లేవనెత్తాయి.
కాగా,జూలై చివర్లో మసూద్ పెజెష్కియన్ మొజ్తాబా ఖమేనీని కలిసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
ఈ భేటీలో సైనిక వ్యవహారాలతో పాటు విదేశీ మారకద్రవ్య నిర్వహణ, ఇంధన వినియోగం, అంతర్జాతీయ భాగస్వాములతో ఆర్థిక సంబంధాలు వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
వివరాలు
అందరి దృష్టి కొత్త వీడియోలపైనే!
మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించేందుకు ఇరాన్ ప్రభుత్వం మరిన్ని దృశ్యాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
దీంతో కొత్త వీడియోలు ఎప్పుడు చిత్రీకరించారనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది.
అలాగే ఖమేనీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన ఎంతవరకు చురుకుగా ఉన్నారు?అనే ప్రశ్నలకు ఈ దృశ్యాలు సమాధానం ఇస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు విడుదలైన వీడియోల్లో చాలా వరకు వాటిని ఎప్పుడు చిత్రీకరించారనే తేదీని వెల్లడించలేదు.
అందువల్ల ఇకపై విడుదల చేసే వీడియోల్లో చిత్రీకరణ తేదీ,ఖమేనీ కనిపించే తీరు,ఆయన కార్యకలాపాలను అంతర్జాతీయ పరిశీలకులు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది.
ఈ కొత్త దృశ్యాలు ఆయన ఆరోగ్యంపై కొనసాగుతున్న అనుమానాలకు ఎంతవరకు తెరదించుతాయన్నది వేచి చూడాలి.