LOADING...
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు దగ్గరపడిందా?.. పుతిన్‌ సంచలన ప్రకటన!
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు దగ్గరపడిందా?.. పుతిన్‌ సంచలన ప్రకటన!

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు దగ్గరపడిందా?.. పుతిన్‌ సంచలన ప్రకటన!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2026
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని ఆయన వెల్లడించారు. మాస్కోలో నిర్వహిస్తున్న విక్టరీ డే వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడారు. యుద్ధ విరమణకు సంబంధించి చర్చలకు రష్యా సిద్ధమవుతోందన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే విషయంపై ఆయన ఎలాంటి కాలపరిమితిని ప్రకటించలేదు. అలాగే శాంతి ఒప్పందంపై కూడా స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ పుతిన్‌ వ్యాఖ్యలతో ప్రపంచ దృష్టి ఒక్కసారిగా రష్యాపై కేంద్రీకృతమైంది. ఇదిలా ఉండగా తన అభ్యర్థన మేరకు రష్యా, ఉక్రెయిన్‌లు మూడు రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక రోజు క్రితమే ప్రకటించారు.

వివరాలు

యుద్ధం ముగింపునకు సంబంధించి చర్చలు

ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ముగింపునకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని కూడా ట్రంప్‌ వెల్లడించారు. ఆ ప్రకటన వచ్చిన మరుసటి రోజే పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేయడంతో శాంతి అవకాశాలపై ఆశలు మరింత పెరిగాయి. ఉక్రెయిన్‌ నుంచి ముప్పు ఉండొచ్చనే ఆందోళనల నేపథ్యంలో ఈసారి రష్యా విక్టరీ డే వేడుకలను గతంతో పోలిస్తే అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య చాలా పరిమితంగా నిర్వహించింది. సాధారణంగా ఈ పరేడ్‌లో భారీ ట్యాంకులు, ఆయుధాలను ప్రదర్శించే రష్యా, ఈసారి మాత్రం రెడ్ స్క్వేర్ వద్ద అలాంటి ప్రదర్శనలు చేయలేదు. బదులుగా భారీ డిజిటల్‌ స్క్రీన్లపై అధునాతన క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్ల దృశ్యాలను ప్రదర్శించింది.

వివరాలు

2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభం

ఉక్రెయిన్‌ యుద్ధంలో పాల్గొన్న రష్యా సైనికులు ఈ పరేడ్‌లో కవాతు నిర్వహించగా, నార్త్ కొరియా బలగాలు కూడా పాల్గొనడం గమనార్హం. మరోవైపు ఉక్రెయిన్‌తో శాశ్వత శాంతి ఒప్పందం కుదిరిన తర్వాతే తాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా సమావేశమవుతానని పుతిన్‌ స్పష్టం చేశారు. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పటికే నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ యుద్ధంలో ఇరుదేశాలకు చెందిన వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత రక్తపాతం సృష్టించిన యుద్ధంగా ఇది నిలిచింది.

Advertisement