
Pakistan: పాకిస్థాన్ సైన్యమే లక్ష్యంగా బాంబు దాడి.. 11 మంది హతం
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుడు జరిగింది. సాయుధ బలగాల ప్రయాణంలో ఉన్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్‌లు జరిపిన దాడిలో, ఇద్దరు అధికారులతో పాటు మొత్తం 11 మంది పారామిలిటరీ సిబ్బంది హతమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. కుర్రం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దాడి పూర్తిగా ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు సమాచారం. బాంబు పేలుడు తర్వాత మిలిటెంట్‌లు భారీగా కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో ఇద్దరు ఉన్నతాధికారి సహా తొమ్మిది మంది పారామిలిటరీ సిబ్బంది ప్రాణాలను కోల్పోయారు. ఈ దాడికి పాల్పడిన వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
వివరాలు
పాక్ దళాలకు తలనొప్పిగా టీటీపీ
దాడికి సంబంధించి పాక్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు అయితే, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఈ దాడికి తమదే బాధ్యత అని వెల్లడించింది. అఫ్గాన్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ గ్రూప్ పాకిస్తాన్ సైనిక దళాలకు పెద్ద సమస్యగా మారింది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి, ఈ గ్రూప్ ఇస్లామాబాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భద్రతా సిబ్బందిని,సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని పలు ఘాతుక దాడులు చేసిన సందర్భాలు నమోదయ్యాయి.