LOADING...
Israel: ఎడారిలో ద్రాక్ష తోటలు.. ఇజ్రాయెల్‌ మరో అరుదైన ఘనత

Israel: ఎడారిలో ద్రాక్ష తోటలు.. ఇజ్రాయెల్‌ మరో అరుదైన ఘనత

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2026
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్‌ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఎడారి ప్రాంతంగా పేరుగాంచిన నెగేవ్‌లో భారీ స్థాయిలో ద్రాక్ష తోటలను అభివృద్ధి చేసి, నాణ్యమైన వైన్‌ తయారీ చేపడుతోంది. ఈ విజయంతో నెగేవ్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాత వైన్‌ తయారీ ప్రాంతాల జాబితాలో నెగేవ్‌ చోటు సంపాదించడం విశేషంగా మారింది.

వివరాలు 

నాలుగేళ్లుగా ప్రత్యేక ప్రణాళికతో ద్రాక్ష సాగు

'సంరక్షిత భౌగోళిక సూచిక' జాబితాలో నెగేవ్‌ను చేర్చడంతో అది షాంపెయిన్‌, చియాంటీ, నాపా వ్యాలీ వంటి ప్రముఖ వైన్‌ ప్రాంతాల సరసన నిలిచింది. ఎడారి భూముల్లో వ్యవసాయాన్ని విస్తరించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, ప్రైవేట్‌ దాతృత్వ సంస్థ మెరేజ్‌ ఫౌండేషన్‌ కలిసి గత నాలుగేళ్లుగా ప్రత్యేక ప్రణాళికతో ద్రాక్ష సాగును ప్రోత్సహిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో వైన్‌ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మెరేజ్‌ ఫౌండేషన్‌ కార్యనిర్వాహక సంచాలకురాలు నికోల్‌ హోడ్‌ స్ట్రో వెల్లడించారు. ఈ గుర్తింపు రావడం వల్ల నెగేవ్‌ ప్రాంతం అత్యుత్తమ నాణ్యత గల వైన్‌ తయారీ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు.

వివరాలు 

సవాళ్లు ఎదురైనా.. పట్టుదలతో ముందుకు

ఎడారి వాతావరణంలో ద్రాక్ష తోటలను పెంచడం ప్రారంభంలో చాలా కష్టంగా మారిందని ఆమె తెలిపారు. నీటి కొరత,తీవ్ర ఉష్ణోగ్రతలు వంటి అనేక సవాళ్లు ఎదురైనా స్థానిక రైతులు, వైన్‌ తయారీదారులు పట్టుదలతో ముందుకు సాగారని చెప్పారు. ఆధునిక పద్ధతులు,ప్రత్యేక శ్రద్ధతో అసాధ్యంగా కనిపించిన పనిని విజయవంతం చేశారన్నారు. ప్రస్తుతం నెగేవ్‌లో 60కు పైగా వైన్‌ తయారీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా ప్రతి ఏడాది పది లక్షలకు మించిన వైన్‌ సీసాలు తయారవుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Advertisement