ఇజ్రాయెల్ భీకర దాడులు.. గాజాలో 1300 భవనాలు నేలమట్టం
ఇజ్రాయెల్ భీకర దాడుల కారణంగా గాజా గజగజ వణికిపోతోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 1300లకుపైగా భవనాలు కుప్పకూలిపోయాయి. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి(UNO) ప్రకటించింది. దాడుల్లో భాగంగా 2200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. హమాస్ ఉగ్ర నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మిలిటరీ సాగిస్తున్న భీకర దాడులతో గాజా భీతిల్లిపోతోంది. గతవారం నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో గాజా నగరంలో కల్లోలంగా మారింది. భారీ భవంతులు పేకమేడల్లా నేలరాతున్నాయి. ఇప్పటివరకు 1300లకుపైగా భవనాలు నేలకూలినట్లు ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ ఆఫీస్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ ప్రకటించింది.
2,215 మంది పాలస్తీనీయుల మృతి : హమాస్
గాజా నగరంలో 2,215 మంది మృతివ్యాత పడ్డారు. ఇజ్రాయెల్ వైమానిక పోరుతో గాజాలో మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 2,215 మంది పాలస్తీనీయులు తుదిశ్వాస విడిచినట్లు హమాస్ ఆరోగ్య శాఖ వివరించింది. అయితే వీరిలో 724 మంది చిన్నారులున్నారని చెప్పిన ఆరోగ్యశాఖ, మరో 8,714 మంది తీవ్ర గాయాలబారిన పడ్డారని తెలిపింది. గడిచిన 24 గంటల్లోనే గాజాలో 126 మంది చిన్నారులతో పాటు 324 మంది చనిపోయారని గణాంకాలను బహిర్గతపర్చింది. అయితే గాజాలో క్షేత్రస్థాయిలో (గ్రౌండ్ ఆపరేషన్)లో భాగంగా ఉత్తర గాజాలోని పాలస్తీనీయులు ప్రాణభయంతో బెంబెలిత్తిపోతున్నారు. ఈ మేరకు వారంతా దక్షిణ గాజా వైపు, ఇతర దేశాలపైపు వలసబాట పట్టడం గమనార్హం.