LOADING...
Israel: ఇరాన్ క్షిపణుల్లో క్లస్టర్ బాంబులు?.. ఇజ్రాయెల్ ఆరోపణలు
ఇరాన్ క్షిపణుల్లో క్లస్టర్ బాంబులు?.. ఇజ్రాయెల్ ఆరోపణలు

Israel: ఇరాన్ క్షిపణుల్లో క్లస్టర్ బాంబులు?.. ఇజ్రాయెల్ ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2026
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో యుద్ధాన్ని త్వరలో ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు ప్రకటిస్తున్నప్పటికీ, పశ్చిమాసియాలో పరిస్థితులు మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు ఇరాన్ కూడా ప్రతిదాడులు చేపడుతోంది. ఇప్పటివరకు తమపై ఇరాన్ ప్రయోగించిన సుమారు 300 బాలిస్టిక్ క్షిపణుల్లో సగం వరకు క్లస్టర్ బాంబులను మోసుకొచ్చాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం ఆరోపించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళాలు(IDF) అధికారికంగా వెల్లడించింది.

వివరాలు 

గాల్లో పేలిన వార్‌హెడ్ ముక్కలు దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలో చెల్లాచెదురుగా పడ్డాయి 

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు వరుసగా క్షిపణి దాడులు జరుగుతున్నాయని ఐడీఎఫ్ తెలిపింది. మంగళవారం కూడా అనేక క్షిపణులను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకున్నాయని పేర్కొంది. అయితే భారీ వార్‌హెడ్‌ను మోసుకొచ్చిన ఒక క్షిపణి మాత్రం జెరూసలేం సమీపంలో గాల్లోనే పేలిపోయిందని వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. గాల్లో పేలిన ఆ వార్‌హెడ్ ముక్కలు దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలో చెల్లాచెదురుగా పడ్డాయని సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. క్లస్టర్ బాంబుల వినియోగం ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు పెద్ద సవాలుగా మారిందని అధికారులు చెబుతున్నారు.

వివరాలు 

ఏమిటి క్లస్టర్ బాంబులు?

గత ఏడాది జూన్‌లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన 12రోజుల యుద్ధంలో కూడా క్లస్టర్ బాంబుల వినియోగంపై ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ఇరాన్ కనీసం మూడుసార్లు ఇజ్రాయెల్‌పై ఈ రకమైన బాంబులను ప్రయోగించిందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఫోటోలు, వీడియోల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు ఆ సంస్థ తెలిపింది. క్లస్టర్ ఆయుధాలు గాల్లోనే విడిపోయి అనేక చిన్న బాంబులుగా మారి ఒకేసారి భిన్న లక్ష్యాలపై దాడి చేసే విధంగా రూపొందించబడతాయి. అద్దం పగిలితే గాజు ముక్కలు వివిధ దిశల్లో చెల్లాచెదురుగా పడి గుచ్చుకున్నట్లుగా ఇవి విస్తరిస్తాయి. సాధారణంగా 24 నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై వీటిని ప్రయోగించవచ్చు. సాధారణ బాంబులతో పోలిస్తే వీటి విధ్వంస ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

Advertisement

వివరాలు 

ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించిన దేశాలు ఇవే.. 

ఈ బాంబులు గాల్లో పేలిపోయి చిన్న చిన్న బాంబులుగా విడిపోవడంతో లక్ష్య ప్రాంతంలో పౌర నష్టం అధికంగా ఉండే ప్రమాదం ఉంది. అంతేకాకుండా వీటిలోని కొన్ని చిన్న బాంబులు వెంటనే పేలకుండా నేలపై పడిపోయి తర్వాత పేలే అవకాశం ఉంటుంది. అందువల్ల యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఈ బాంబుల ముప్పు కొనసాగుతూనే ఉంటుంది. 2008లో 112 దేశాలు,మరో 12 అంతర్జాతీయ సంస్థలు క్లస్టర్ బాంబుల తయారీ, నిల్వ, బదిలీ, వినియోగాన్ని నిషేధించే ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఇరాన్, ఇజ్రాయెల్, భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, రష్యా వంటి కొన్ని దేశాలు మాత్రం ఆ ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాయి.

Advertisement