Israel: హెజ్బొల్లా టన్నెల్స్‌పై ఇజ్రాయెల్ మెరుపుదాడి.. లెబనాన్‌లో 4.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ లెబనాన్‌లోని అలీ అల్-తాహెర్ పర్వత శ్రేణిలో భారీ పేలుడు సంభవించిన అనంతరం 4.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. హెజ్బొల్లా అండర్‌గ్రౌండ్ టన్నెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ప్రకంపనలను అమెరికా భూగర్భ శాస్త్ర పరిశోధన సంస్థ (USGS) నమోదు చేసింది. అదే సమయంలో, లెబనాన్ అధికారిక వార్తా సంస్థ ఈ ప్రాంతంలో "భారీ పేలుడు" సంభవించినట్లు వెల్లడించింది. పేలుడు శబ్దాలు, దాని ప్రభావంతో వచ్చిన ప్రకంపనలు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వినిపించినట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ఇజ్రాయెల్ జరిపిన పేలుడు కారణంగానే 4.1 తీవ్రతతో ప్రకంపనలకు కారణమైందని నిర్ధారించే అధికారిక సమాచారం అందుబాటులో లేదు.
వివరాలు
సుమారు 20 ఏళ్లుగా నిర్మించిన మౌలిక వసతులు ధ్వంసం
ఈ ఆపరేషన్ ద్వారా ఇరాన్ నిధులు, ప్రణాళికలతో సుమారు రెండు దశాబ్దాలుగా నిర్మించిన హెజ్బొల్లా మౌలిక వసతులను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు.
వీరిద్దరూ సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
"అలీ అల్-తాహెర్ పర్వత శ్రేణిపై, దాని కింద ఉన్న ఆపరేషనల్ నియంత్రణను సాధించే ప్రక్రియలో ఈ మౌలిక వసతుల విధ్వంసం కీలక ఘట్టం" అని వారు పేర్కొన్నారు.
వివరాలు
రెండు కిలోమీటర్లకు పైగా విస్తరించిన టన్నెల్
ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించిన వివరాల ప్రకారం.. ధ్వంసం చేసిన అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్ రెండు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది.
ఇందులో రాకెట్లు, మిస్సైల్స్, డ్రోన్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్స్, మెషిన్ గన్స్, మైన్లు, ఇతర పేలుడు పదార్థాలను నిల్వ చేసినట్లు తెలిపింది.
ఈ కాంప్లెక్స్‌లో హెజ్బొల్లా ఎలైట్ బద్ర్ యూనిట్‌కు చెందిన కమాండ్ సెంటర్, ఆయుధాల నిల్వ కేంద్రాలు ఉన్నాయి.
అంతేకాకుండా, యోధులు ఎక్కువ కాలం భూగర్భంలోనే ఉండేందుకు వీలుగా నివాస సదుపాయాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
వివరాలు
1,100 టన్నుల పేలుడు పదార్థాల వినియోగం
హెజ్బొల్లా భూగర్భ కాంప్లెక్స్‌ను ధ్వంసం చేసేందుకు సుమారు 1,100 టన్నుల పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఈ భారీ పేలుడు కారణంగా దక్షిణ లెబనాన్‌తో పాటు బెకా వాలీ, ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో శబ్దాలు, కదలికలు నమోదైనట్లు నివేదికలు వెల్లడించాయి.
స్థానిక నివేదికలు, భూకంప శాస్త్ర కేంద్రం ఈ కదలికను భారీ విధ్వంసక పేలుడుతో అనుసంధానించినప్పటికీ.. పేలుడు నేరుగా భూకంపానికి కారణమైందనే విషయంపై USGS నుంచి తక్షణ అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు.