ఇరాన్ ఆదేశంతోనే లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లా మిలిటెంట్ల దాడి: ఇజ్రాయెల్
లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దులో ఇరాన్ ఆదేశాలతోనే హిజ్బుల్లా మిలిటెంట్లు దాడి చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. ఇరాన్ సూచనల మేరకు దక్షిణ (గాజా)లో తమ సైన్యం యుద్ధ ప్రయత్నాల నుంచి దృష్టిని మరల్చడానికి హిజ్బుల్లా మిలిటెంట్లు కాల్పులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ ప్రధాన సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులు చేస్తున్న నేపథ్యంలో లెబనాన్ సరిహద్దుకు సమీపంలోని 28 గ్రామాలను ఇజ్రాయెల్ సైన్యం ఖాళీ చేయిస్తోంది. ఆదివారం లెబనాన్ నుంచి ప్రయోగించిన క్షిపణలు వల్ల ఒక ఇజ్రాయెల్ పౌరుడు, సైనికుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా హిజ్బుల్లా సైనిక స్థావరాలపై తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌లోకి ఇప్పటివరకు తొమ్మిది రాకెట్ల ప్రయోగం
హమాస్ మిలిటెంట్లను అంతమొందించే క్రమంలో గాజాలోని పాలస్తీనాలో విధ్వంసం సృష్టిస్తే తాము చూస్తూ ఊరుకోమని ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. లెబనాన్ హిజ్బుల్లా మిలిటెంట్లు అత్యంత శక్తివంతమైన సైనిక దళం. ఇజ్రాయెల్ భూభాగంలోకి వెళ్లి దాడి చేయగల సుదూర రాకెట్లను వారు కలిగి ఉన్నారు. 2006లో హిజ్బుల్లా మిలిటెంట్లు- ఇజ్రయెల్ మధ్య నెల రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. ఇదిలా ఉంటే, లెబనీస్ సరిహద్దు నుంచి రెండు కిలోమీటర్ల వరకు నివసించే పౌరులందరినీ ఖాళీ చేయించి, వారిని సహాయక కేంద్రాలకు తరలించారు. ఇప్పటికే సరిహద్దు సమీపంలోని మూడు వంతులు గ్రామాలు ఖాళీ అయ్యాయి. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి ఇప్పటివరకు తొమ్మిది రాకెట్లు ప్రయోగించబడ్డాయి. వాటిలో ఐదు రాకెట్లను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది.