Israel: ఖమేనీని తొలగించాలని నవంబర్‌లోనే నిర్ణయించుకొన్నాం… ఇజ్రాయెల్ రక్షణ మంత్రివర్గం కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఖమేనీని తొలగించాలనే నిర్ణయాన్ని తమ ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లోనే తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కట్జ్ మాట్లాడుతూ, గత సంవత్సరం చివర్లో ఉన్నతస్థాయి భద్రతా సమావేశం నిర్వహించామని చెప్పారు. ఆ సమావేశం బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలో జరిగిందని, అందులో ఖమేనీని అడ్డంకిగా భావించి ఆయనను తొలగించాలని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
వివరాలు
2026 మధ్యకాలంలో అమలు కావాల్సి ఆపరేషన్
ప్రస్తుతం ఇరాన్ పై కొనసాగుతున్న ఆపరేషన్ అసలు ప్రణాళిక ప్రకారం 2026 మధ్యకాలంలో అమలు కావాల్సి ఉందని తెలిపారు. అయితే ఆ సమయంలో ఈ ప్రణాళిక గురించి అమెరికాకు వివరాలు తెలియజేయలేదని చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. ఆ నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్,నెతన్యాహు మధ్య దీనిపై చర్చలు జరిగినట్లు కట్జ్ వెల్లడించారు. ఈ పరిణామాల మధ్య ఇరు దేశాలు కలిసి ముందుగానే ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.
వివరాలు
ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ దాడులు
ఈ ఆపరేషన్ ప్రారంభమైన మొదటి రోజే ఖమేనీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు భారీ దాడులు చేపట్టాయి. ఆ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో పలువురు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. టెహ్రాన్‌లోని ట్రాఫిక్ కెమెరాలు, ఫోన్ నెట్‌వర్క్‌లను విశ్లేషిస్తూ ఖమేనీ కదలికలను గమనించి, అత్యంత ఖచ్చితత్వంతో దాడి నిర్వహించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు కొనసాగిస్తోంది. దీంతో ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తోంది.