Gaza : గాజా దిగ్భంధనం.. నీరు, విద్యుత్తు, ఆహారం నిలిపివేసి మృగాలతో పోరాడుతున్నాం : ఇజ్రాయెల్
గాజాను పూర్తిగా అధీనంలోకి తీసుకోవాలని, ఇందుకు గాను ఆ ప్రాంతాన్ని అన్ని వైపుల నుండి దిగ్భంధనం చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. హమాస్ ముష్కరులు పాేగా వేసిన గాజాకు కీలక సరఫరాలను ఇజ్రాయెల్ నిలిపేసింది. హమాస్‌పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ గాజాపై పూర్తిగా పట్టు సాధించాలని నిర్ణయం తీసుకుంది. గాజా ని పూర్తిగా దిగ్బంధించమని ఆదేశాలు జారీ చేశానని, ఇకపై ఆ ప్రాంతంలో విద్యుత్, ఆహారం, నీరు లాంటివేవీ అందవని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవో గల్లాంట్ పేర్కొన్నారు. ఈ పోరాటంలో తాము మానవ మృగాలతో తలపడుతున్నామని, ఇందుకు తగ్గట్లే యుద్ధం చేస్తామన్నారు. అంతకుముందే బెర్షెబలోని ఐడీఎఫ్ దక్షిణ కమాండ్‌పై సమీక్షలు నిర్వహించారు.
ప్రజల మధ్యలో ముష్కరులు దాక్కునే ప్రమాదం ఉందన్న ఐడీఎఫ్
మరోవైపు గాజా సరిహద్దుల్లో గల ఇజ్రాయెల్ పట్టణాలపై తాము పూర్తిగా పట్టు సాధించామని ఐడీఎఫ్ ప్రతినిధి డేనియల్ హగారి ప్రకటన చేశారు. అయితే అక్కడ ప్రజల మధ్యలోనే ఉగ్రవాదులు తలదాచుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొద్ది గంటలపాటు ముష్కరులకు, సైనికులకు మధ్య పోరాటం సాగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ యుద్ధంలో పలువరు ఉగ్రవాదులను అంతం చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం యుద్ధం జరగడం లేదని, గాజా సరిహద్దుల్లో ట్యాంకులు పహారా కాస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే వీటికి హెలికాప్టర్లు, డ్రోన్లు రక్షణగా గస్తీ కాస్తున్నాయన్నారు. ఐడీఎఫ్ బలగాలకు మద్దతుగా మరో 3,00,000 మంది దళాలను మోహరించినట్లు స్పష్టం చేశారు.