LOADING...
Irans secret nuclear facility: ఇరాన్ రహస్య అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి
ఇరాన్ రహస్య అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి

Irans secret nuclear facility: ఇరాన్ రహస్య అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2026
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాన్‌కు చెందిన రహస్య భూగర్భ అణు ప్రాజెక్ట్‌ను తమ దళాలు ధ్వంసం చేశాయని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ప్రకటించాయి. టెహ్రాన్ సరిహద్దు ప్రాంతంలోని మింజాదెహైలో గుప్తంగా ఏర్పాటు చేసిన న్యూక్లియర్ కేంద్రం కాంపౌండ్‌పై లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డెఫ్రిన్ వెల్లడించారు. ఆ కేంద్రంలో శాస్త్రవేత్తలు రహస్యంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారని తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. 2025లో అమెరికా దాడుల తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమంలో కీలక భాగాన్ని ఈ ప్రాంతానికి తరలించినట్లు కూడా పేర్కొన్నారు.

వివరాలు 

'ఆపరేషన్ రైజింగ్ లయన్'ను గుర్తు చేసిన ఐడీఎఫ్

గత సంవత్సరం జూన్‌లో ఇరాన్‌పై 'ఆపరేషన్ రైజింగ్ లయన్' (Operation Rising Lion) పేరిట 12 రోజులపాటు ఇజ్రాయెల్ దాడులు చేపట్టిన విషయాన్ని డెఫ్రిన్ ప్రస్తావించారు. ఆ ఆపరేషన్ సమయంలో ఉపయోగించిన మందుగుండు సామగ్రికంటే,ప్రస్తుతం నాలుగు రోజుల వ్యవధిలోనే ఎక్కువ పరిమాణంలో పేలుడు పదార్థాలను ఇరాన్‌పై వినియోగించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ గతంలో ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసినప్పటికీ, ఆ దేశం అణు కార్యకలాపాలను ఆపకుండా అణ్వాయుధాల అభివృద్ధిని కొనసాగిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అణు సామగ్రిని టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రహస్య భూగర్భ స్థావరంలో నిల్వ ఉంచినట్లు తమకు స్పష్టమైన సమాచారం రావడంతో ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు చెప్పారు.

వివరాలు 

ఇరాన్ క్షిపణి వ్యవస్థలపై దాడులు

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్‌కు చెందిన సుమారు 300 క్షిపణి లాంచర్‌లు దెబ్బతిన్నాయని ఐడీఎఫ్ ప్రతినిధి వెల్లడించారు. అంతేకాదు, ఇరాన్‌లోని బాలిస్టిక్ క్షిపణి శ్రేణులు మరియు వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని తమ వైమానిక దళాలు నిరంతరం దాడులు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఇజ్రాయెల్ నిర్వహించిన తాజా దాడులకు సంబంధించిన దృశ్యాలను కూడా ఐడీఎఫ్ సోషల్ మీడియా వేదికల్లో విడుదల చేసింది.

Advertisement