Israel: పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై నమ్మకం లేదు: ఇజ్రాయెల్ రాయబారి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ చర్చల్లో పాకిస్థాన్ పాత్రపై ఇజ్రాయెల్ అనుమానం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేసింది. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రాయబారి అజార్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ను తాము విశ్వసించలేమని, అమెరికా తన స్వప్రయోజనాల దృష్ట్యా దాని మధ్యవర్తిత్వాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంలో ఖతార్,తుర్కియే వంటి దేశాల ద్వారా హమాస్‌తో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రస్తావించారు.
వివరాలు
లెబనాన్‌పై సైనిక చర్యలు కొనసాగుతాయి: అజార్
ఇరాన్‌లో తమ లక్ష్యాలను సాధించేందుకు అమెరికాతో సమన్వయం కీలకమని ఆయన పేర్కొన్నారు. అలాగే, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. అయితే, లెబనాన్‌పై తమ సైనిక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇరాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌కు లెబనాన్‌కు సంబంధం లేదన్నారు. దక్షిణ లెబనాన్ ప్రాంతంలో హెజ్‌బొల్లా మౌలిక వసతులను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని చెప్పారు. అది ఇజ్రాయెల్ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.