ISRAEL : గాజాను చుట్టుముట్టిన ఇజ్రాయెల్.. నేడు ఇజ్రాయెల్ పర్యటనలో బ్లింకెన్
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) గాజా నగరాన్ని చుట్టముట్టాయి. ఈ మేరకు హమాస్ మిలిటెంట్ సంస్థ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆ దేశ దళాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇజ్రాయెల్ దళాల ధాటికి పాలస్తీనా తీవ్రవాద బృందం భూగర్భ సొరంగాల నుంచి హిట్ అండ్ రన్ దాడులతో ప్రతిఘటించింది. ఇదే సమయంలో అరబ్ నేతలు, ఇజ్రాయెల్‌పై గాజా ముట్టడిని ఆపేయాలని, ఈ మేరకు యుద్ధం నిబంధనలను సడలించాలని కోరింది. పౌరులకు సహాయం చేయడానికి దాడులకు విరామం ఇవ్వాలని ఒత్తిడి పెంచింది. మరోవైపు ఇజ్రాయెల్ దళాలను బ్యాగుల్లో పెట్టి పార్సిల్ చేస్తామని హమాస్ మిలిటెంట్లు హెచ్చరిస్తున్నారు. తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం రెండోసారి ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించనున్నారు.
4 వారాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
మానవతావాద కోణంలో యుద్ధానికి తాత్కాలిక విరామం ఇవ్వాలని అగ్రరాజ్యాధిపతి జో బిడెన్ సూచన మేరకు బ్లింకన్ జోర్డాన్‌కు కూడా వెళ్లనున్నారు. గతంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తోసిపుచ్చారు. ఈ మేరకు తాము ముందుకు సాగుతున్నామని, మమ్మల్ని ఏదీ అడ్డుకోలేదన్నారు. గాజా స్ట్రిప్‌లో హమాస్ పాలనను నాశనం చేస్తానని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య దాదాపు నాలుగు వారాల నుంచి యుద్ధం కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి కారణంగా 1,400 మంది ఇజ్రాయెల్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా 240 మందికి పైగా బందీలుగా చిక్కారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో గాజాలో 9,000 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు.