Israel-Hamas War: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సైనికాధికారి మృతి
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ కమాండర్, సిరియా, లెబనాన్ సైనిక కార్యకలాపాల ఇన్‌ఛార్జ్ అయిన సెయ్యద్ రెజా మౌసావి ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు. సిరియాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో అతను చనిపోయినట్లు ఇరానియన్ తస్నిమ్ వార్తా సంస్థ పేర్కొంది. సిరియాలోని డమాస్కస్ గ్రామీణ ప్రాంతం సెట్ జైనాబ్‌లో భారీ పేలుళ్ల శబ్దం వినిపించినట్లు ఇజ్రాయెల్ వార్తాపత్రిక 'ది జెరూసలేం పోస్ట్' ధృవీకరించింది. ఇరాన్, సిరియా మధ్య సైనిక కూటమిని సమన్వయం చేయడానికి, లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్‌తో సహా ఆ ప్రాంతంలోని టెర్రర్ సంస్థలకు ఆయుధాలను సరఫరా చేయడంలో మౌసావి కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇజ్రాయెల్ విశ్వసించింది.
ఇజ్రాయెల్ తగినమూల్యం చెల్లించుకుంటుంది: ఇరాన్
ఇరాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని బ్రాడ్‌కాస్టర్ ప్రెస్ టీవీ కూడా మౌసావి మరణాన్ని ధృవీకరించింది. మౌసావిని సిరియాలో సీనియర్ అడ్వైజర్‌గా ప్రెస్ టీవీ పేర్కొంది. జనవరి 2020లో యూఎస్ జరిపిన డ్రోన్ దాడిలో మరణించిన మాజీ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఖాసిం సులేమానీకి మౌసవి చాలా సన్నిహితుడు. సులేమానీ తర్వాత అత్యంత కచ్చితంగా టార్గెట్ చేసిన హత్యగా మౌసావి ఘటనను అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మౌసావి హత్యపై ఇరాన్ స్పందించింది. మౌసావి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటించింది. ఈ నేరానికి ఇజ్రాయెల్ కచ్చితంగా తగినమూల్యం చెల్లించుకుంటుందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ ఉగ్రవాదులపై పోరాటాన్ని కొనసాగించాలని సైన్యానికి పిలుపునిచ్చారు.