Israel-Hamas war: గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికాపై అరబ్ దేశాల ఒత్తిడి
హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. వైమానిక బాంబులు, అధునాతన ఆయుధాలతో విరుచుకపడుతోంది. తాజాగా యూఎన్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో నిర్వహిస్తున్న శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో దాదాపు 68మంది మంది చనిపోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్-కిద్రా తెలిపారు. ఈ క్రమంలో గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అరబ్ దేశాలైన ఈజిప్ట్, జోర్డాన్ శనివారం అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్‌పై ఒత్తిడి తెచ్చాయి. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సిద్ధంగా లేదని అరబ్ దేశాల నాయకులతో బ్లింకెన్ చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. తమ దేశ ప్రజలను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందన్నారు.
కాల్పులను విరమిస్తే హమాస్‌కు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది: బ్లింకెన్
జోర్డాన్ అమ్మాన్‌లో సౌదీ, ఖతారీ, ఎమిరాటీ, జోర్డాన్, ఈజిప్టు విదేశాంగ మంత్రులతో బ్లింకెన్ శనివారం సమావేశమై కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై చర్చించారు. అరబ్ దేశాల మంత్రులు, బ్లింకెన్ మధ్య జరిగిన సంయుక్త సమావేశంలో, అరబ్ మంత్రులు గాజాపై దాడులను ఆపాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలను ఖండించారు. ఈజిప్టు విదేశాంగ మంత్రి సమేహ్ షౌక్రెహ్ మాట్లాడుతూ, గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దూకుడును ఈజిప్టు సహించడం లేదన్నారు. జోర్డాన్ విదేశాంగ మంత్రి ఐమాన్ సఫాది మాట్లాడుతూ, ఈ యుద్ధం ఆగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కాల్పులను విరమిస్తే, హమాస్ మిలిటెంట్లు తిరిగి సమావేశం కావడానికి, తమ దేశంపై దాడి చేయడానికి వీలుకు కలుగుతుందని బ్లింకెన్ పేర్కొన్నారు.