HAMAS : ఇజ్రాయెల్ థాటికి గాజాగేట్ వద్ద 195 మంది శరణార్థుల మృతి : హమాస్
ఇజ్రాయెల్ దళాల (IDF) థాటికి గాజా గేట్ వద్ద దాదాపు 195 మంది శరణార్థులు ప్రాణాలు కోల్పోయారని హమాస్ వెల్లడించింది. ఉత్తరగాజాలోని జబాలియాపై ఇజ్రాయెల్ జరిపిన రెండు దాడుల్లో 195 మంది పాలస్తీనియన్లు మరణించారని పేర్కొంది. మరో 120 మంది శిథిలాల కింద తప్పిపోయారని గాజాలోని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం గురువారం ప్రకటన చేసింది. ఈ మేరకు కనీసం 777 మంది గాయపడ్డారని వివరించింది. ఇదే సమయంలో ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థుల శిబిరంలోని ఇళ్లపై బుధవారం ఇజ్రాయెల్ దాడులు చేసింది. మరోవైపు హమాస్‌పై దాడిలో భాగంగా తమ దళాలు "గాజా సిటీ గేట్ల వద్ద" ఉన్నాయని ఇజ్రాయెల్ వెల్లడించింది.గాజా భూభాగంలో ఇదే అతిపెద్ద శరణార్థి శిబిరం కావడం గమనార్హం.
శరణార్థుల మరణాలు బాధాకరం : ఐడీఎఫ్
గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ మంగళ, బుధవారాల్లో బాంబు దాడి చేసింది. దీంతో 195 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజాలోని హమాస్ పేర్కొంది. ముందస్తు ప్రణాళిక, ఖచ్చితమైన నిఘా, ఉమ్మడి దాడులతో (భూమి, గగనతలంతో పాటు సముద్రం నుంచి), గాజా స్ట్రిప్‌కు ఉత్తరాన ఉన్న హమాస్ రక్షణ రేఖలను మా దళాలు ఛేదించాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వివరించింది. ఇదే సమయంలో IDF చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి హమాస్‌పై యుద్ధం సమయంలో శరణార్థుల మరణాలు బాధాకరమని అంగీకరించారు. అయినప్పటికీ ఈ దాడులు అవసరమని నొక్కి చెప్పారు. ఇదో సుదీర్ఘ యుద్ధం అని, ప్రస్తుతం యుద్ధం మధ్యలో ఉన్నామని పునరుద్ఘాటించారు. హమాస్ తో చివరి వరకు పోరాడుతామన్నారు.