Israel: 'అక్టోబరు 7న మీ కళ్లు ఎక్కడ ఉన్నాయి'... సూటిగా అడిగిన ఇజ్రాయెల్
'All Eyes On Rafah' ప్రచారం సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. సెలబ్రిటీలు, అథ్లెట్లు, మిలియన్ల మంది వినియోగదారులు యుద్ధంలో దెబ్బతిన్న గాజా నగరం రఫాపై ఇజ్రాయెల్ దాడులపై దృష్టిని ఆకర్షించడానికి ప్రచారంలో పాల్గొంటున్నారు. 'All Eyes On Rafah' ద్వారా ప్రపంచం కళ్లు రఫాపైనే ఉన్నాయని, ప్రజలు తాము పాలస్తీనాతోనే ఉన్నామని సందేశం ఇస్తున్నారు. మే 26న, ఇజ్రాయెల్ వైమానిక దాడులు రఫాలోని శరణార్థి శిబిరంలో పిల్లలతో సహా కనీసం 45 మంది పౌరులను చంపాయి. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హమాస్ జరిపిన దాడి గురించి ఎందుకు పోస్టు చేయలేదు
దీనికి ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడి గురించి ఎందుకు పోస్టు చేయలేదని, ఆ రోజు మీ దృష్టి ఎక్కడుందని ఎదురుప్రశ్నించింది. అక్టోబర్ 7, 2023న హమాస్ దాడిలో ఇజ్రాయెల్‌లో దాదాపు 1,160 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది పౌరులు ఉన్నారు. హమాస్ కూడా దాదాపు 250 మందిని బందీలుగా చేసుకుంది. ఉగ్రవాదుల చెరలో ఇప్పటి వరకు 31 మంది చనిపోయారని ఇజ్రాయెల్ భావిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఇజ్రాయెల్ అధికారిక పేజీలో ఆనాటి నరమేధాన్ని ప్రతిబింబించే ఒక దృశ్యాన్ని షేర్ చేసింది. ''మేం అక్టోబర్ 7 గురించి మాట్లాడటం ఎప్పటికీ ఆపం. బందీలు విడుదలయ్యేవరకు మా పోరాటాన్ని ఆపం'' అని స్పష్టం చేసింది.
శరణార్థుల శిబిరంపై దాడిని ఖండించిన ఇజ్రాయెల్
గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, అక్టోబర్ 7 న హమాస్ దాడి తరువాత ఇజ్రాయెల్ ప్రతీకార సైనిక చర్యలో గాజాలో కనీసం 36 వేల మంది మరణించారు. విస్తృత విమర్శల తర్వాత, ఇజ్రాయెల్ రఫా క్యాంప్ దాడిని ఖండించింది. హమాస్ ఆయుధ కేంద్రాన్ని రాకెట్ ఢీకొట్టడం వల్ల అగ్నిప్రమాదం జరిగిందని పేర్కొంది. ఇదే ఈ మరణాలకు కారణం అని తెలిపింది. 'All Eyes On Rafah' నెట్టింట్లో విస్తృతంగా షేర్ అవుతోంది. దాదాపు 45 మిలియన్ల మంది మంది దానిని షేర్ చేశారు. వారిలో భారత సెలబ్రిటీలు కూడా ఉన్నారు.