Israel : గాజా ప్రధాన ఆస్పత్రిలో పెను విషాదం.. 179 మంది సామూహిక ఖననం
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధాటికి గాజా నగరం అల్లాడిపోతోంది. హమాస్ ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా సైన్యం భీకర దాడుల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే గాజాలోని అతిపెద్ద అల్ షిఫా ఆస్పత్రి ప్రాంగణంలో దాదాపు 179 మందిని సామూహికంగా ఖననం చేశామని అల్ షిఫా చీఫ్ మహ్మద్ అబు సల్మియా తెలిపారు. నగరంలో మానవత్వం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సామూహిక సమాధి అయిన జాబితాలో పసిపాపలు, చిన్నారులు ఉన్నారని ఆందోళన చెందారు. మరోవైపు ఆస్పత్రికి ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఐసీయూలో ఉన్న ఏడుగురు పిల్లలతో సహా 29 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. చేసేది లేక మరణించిన వారందరినీ సామూహికంగా పూడ్చిపెట్టామని అధికారులు పేర్కొన్నారు.
అల్ షిఫా ఆస్పత్రి శవాల దిబ్బగా మారింది : డబ్ల్యూహెచ్‌ఓ
ఇదే సమయంలో ఏడుగురు పిల్లలను ఒకే కార్పెట్‌లో చుట్టి సమాధి చేసిన ఫొటోను ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసింది. అల్ షిఫా ఆస్పత్రి శవాల దిబ్బగా మారిందని డబ్ల్యూహెచ్‌ఓ ఆవేదన వెలుబుచ్చింది.యుద్ధం కారణంగా ఆస్పత్రి ప్రాంగణంలో అమానవీయ ఘటనలు జరుగుతున్నాయని వైద్యులు మనోవేదనకు గురయ్యారు. అయితే హమాస్ ఉగ్రవాదులు గాజాలోనే అతిపెద్దదైన ఆస్పత్రిగా పేరుగాంచిన అల్ షిఫాని రక్షణ కవచంగా అడ్డుపెట్టుకుంటున్నారన్న ఇజ్రాయెల్ దళాలు, ఆస్పత్రిని చుట్టుముట్టాయి. గతవారం 72 గంటల పాటు అల్ షిఫాకు కరెంట్, నీరు, ఆహారం సరఫరా నిలిచిపోయింది. ఇక కాల్పుల మోతతో ఆస్పత్రి చుట్టూ భీకర వాతావరణం ఏర్పడింది. యుద్ధం కారణంగా వెలుపలికి వెళ్లే పరిస్థితి లేదని, ఫలితంగా ఆస్పత్రి ప్రాంగణంలోనే ఖననం చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.