ఇజ్రాయెల్‌కు లెబనాన్, సిరియా నుంచి మరో యుద్ధ ముప్పు.. సరిహద్దులో అలజడి
ఇజ్రాయెల్-హమాస్ గ్రూప్ మధ్య 5రోజులుగా భీకర యుద్ధం నడుస్తోంది. ఈ పోరులో ఇరు వైపుల నుంచి ఇప్పటి వరకు 3,000 మంది వరకు మరణించారని ఇజ్రాయెల్ వెల్లడించింది. అలాగే గాజా సరిహద్దు ప్రాంతాలను హమాస్ గ్రూపు నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. ఒక వైపు హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రయెల్‌కు మరో యుద్ధ ముప్పు పొంచి ఉంది. అరబ్ దేశాలైన లెబనాన్, సిరియా నుంచి ఇజ్రాయెల్‌కు యుద్ధ ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ ఏజెన్సీలు చెబుతున్నాయి. సరిహద్దులో ఇజ్రాయెల్-సిరియా బలగాల మధ్య మంగళవారం సాయంత్రం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇదే అదునుగా చేసుకొని ఇజ్రాయెల్ శత్రుదేశాలైన సిరియా, లెబనాన్ ఏకకాలంలో దాడి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
1500 మంది హమాస్ ఉగ్రవాదుల మృతదేహాలు స్వాధీనం: ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ చరిత్రలో ఒక యుద్దంలో 1000 మందికి పైగా ఇజ్రాయెలీలు ఎప్పుడు చనిపోలేదు. మొదటిసారిగా హమాస్ దాడిలో వెయ్యిమందికి పైగా మరణించారు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 765 మంది మరణించినట్లు పాలస్తీనా అధికారులు పేర్కొన్నారు. దాదాపు 1,500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అంటే హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటి వరకు 3,000 వరకు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, హమాస్ వద్ద దాదాపు 150మంది ఇజ్రాయెల్ పౌరులు బంధీలుగా ఉన్నారు. గాజాపై ఇజ్రాయెల్‌పై దాడి చేసిన ప్రతీసారి ఒకరి చొప్పున చంపేస్తామని హమాస్ హెచ్చరించింది. అయితే ఆ బెదిరింపులను లెక్క చేయకుండా ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేసింది.
గాజా ప్రాంతంలో తీవ్రమైన నీటి ఎద్దడి
హమాస్ దాడి తర్వాత గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో గాజాకు నీరు, కరెంట్‌తో పలు పౌర సేవలను ఇజ్రాయెల్ నిలివేసింది. దీంతో గాజా ప్రాంతం ప్రస్తుతం తీవ్రమైన నీటి ముప్పును ఎదుర్కొంటోంది. ఈ చర్య ఫలితంగా గాజా ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే, హమాస్ చర్యను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. హమాస్‌ను అంతం చేస్తామని ప్రతిన బూనారు. హమాస్ దాడులను ఐసిస్ దుశ్చర్యలతో నెతన్యాహు పోల్చారు. హమాస్ ఉగ్రవాదులు పిల్లలను బంధించి, కాల్చివేసి, ఉరితీశారని, వారు నిజంగా క్రూరులు అన్నారు.
ఇజ్రాయెల్ వెళ్లనున్న అమెరికా విదేశాంగ మంత్రి
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాలు ఇప్పటికే ఖండించాయి. ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతును ప్రకటించాయి. తాము పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన ఆకాంక్షలను గుర్తిస్తున్నామని అంటూనే, హమాస్ దాడులను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. హమాస్ గ్రూప్.. పాలస్తీనా ప్రజలకు తీవ్రవాదం, రక్తపాతం తప్ప మరేమీ అందించదని ఆయా దేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. హమాస్‌పై పోరాటానికి ఇజ్రాయెల్‌కు మరింత సైనిక శక్తిని అమెరికా అందిస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం ఆ దేశానికి వెళ్లనున్నారు. నెతన్యాహుతో సమావేశమైన అమెరికా మద్దతును తెలపనున్నట్లు యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు.