Israel: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ఉల్లంఘనకు గురైంది. గురువారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దక్షిణ లెబనాన్‌లో దాడులు నిర్వహించాయి. రాకెట్ నిల్వ కేంద్రంలో హెజ్‌బొల్లా మిలిటెంట్లు చురుకుగా వ్యవహరిస్తున్నారని గుర్తించి దాడి చేసినట్లు టెల్ అవీవ్ పేర్కొంది. అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో మంగళవారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఒప్పందాన్ని ముందుగా ఉల్లంఘించింది హెజ్‌బొల్లానే అని ఇజ్రాయెల్ ఆరోపించింది. వైమానిక దాడిలో జరిగిన నష్టంపై పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు.
పౌరుల తిరుగు ప్రయాణం - ఉద్రిక్తతలు
కాల్పుల విరమణతో తమ స్వస్థలాలకు తిరిగి వస్తున్న పౌరుల కారణంగా దక్షిణ లెబనాన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొందరు నిషేధిత ప్రాంతాల్లోకి ప్రవేశించారని ఇజ్రాయెల్ ఆరోపించింది. అలా ప్రవేశించిన వారిపై కాల్పులు జరిపామని, ఈ ఘటనల్లో ఇద్దరు గాయపడ్డారని లెబనాన్ అధికారులు తెలిపారు. సరిహద్దు గ్రామాలకు ఇంకా రావొద్దని, ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ పూర్తయ్యాకే రావాలని ఇజ్రాయెల్ ప్రజలను హెచ్చరించింది. కయామ్ పట్టణంలో ఐడీఎఫ్ దాడిలో ముగ్గురు పాత్రికేయులు గాయపడ్డారని తెలిపారు.
గాజాలో దాడులు
ఇక గాజాలో ఇజ్రాయెల్ బాంబుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో రెండు పాఠశాలలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా, నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. తమ దాడులు హమాస్ మిలిటెంట్లపైనే కేంద్రీకరించబడ్డాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణశాఖ మాజీ మంత్రి యోవ్ గలాంట్‌లపై ఐసీసీ జారీ చేసిన అరెస్టు వారెంట్లను సవాలు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఐసీసీ ఆధారాలు లేకుండా ఈ వారెంట్లు జారీ చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ''మేము ఈ వారెంట్లను రద్దు చేయాలంటూ పిటిషన్ వేస్తాం. కోర్టు తిరస్కరిస్తే, ఐసీసీ పక్షపాతాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తాయి'' అని ఇజ్రాయెల్ ప్రకటించింది.