Israel-Lebanon: ట్రంప్ ప్రయత్నాలకు నెతన్యాహు గండి.. లెబనాన్‌పై మరోసారి దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైఖరి అడ్డంకిగా మారుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్ది గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌పై మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ఐదుగురు మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
వివరాలు
కాల్పుల విరమణ తర్వాతే దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని పట్టించుకోకుండా ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా పరస్పరం తీవ్ర దాడులకు దిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో యుద్ధానికి శాశ్వత పరిష్కారం కోసం అమెరికా-ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో శుక్రవారం జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే ఆ ఒప్పందం ఎంతకాలం కొనసాగుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్న వేళ, కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ మళ్లీ లెబనాన్‌పై దాడులు ప్రారంభించింది.
వివరాలు
నబటియేలో ధ్వంసమైన భవనాలు
లెబనాన్ మీడియా కథనాల ప్రకారం, అర్ధరాత్రి సమయంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లతో నబటియే ప్రాంతంపై దాడులు జరిపాయి. ఈ దాడుల్లో పలు నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టం, ఆస్తి నష్టం వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు.
వివరాలు
నెతన్యాహుపై ట్రంప్ అసహనం
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యవహారశైలిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణకు అంగీకరించాలని తాను వ్యక్తిగతంగా ఇజ్రాయెల్ నాయకత్వాన్ని కోరినట్లు ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు. ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగితే ఇరాన్‌తో కుదరాల్సిన శాంతి ఒప్పందంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సంయమనం పాటిస్తూ పరిస్థితులను మరింత దిగజార్చకుండా వ్యవహరించాలని, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించినట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ అమలుపై అనిశ్చితి నెలకొనగా, ఇజ్రాయెల్ తాజా దాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.