ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. ఇరు దేశాల్లో 500 మందికి పైగా మృతి
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్- ఇజ్రాయెల్ మధ్య యుధం భీకరంగా సాగుతోంది. హమాస్ మిలిటెంట్లు జరిపిన ఆకస్మిక దాడిలో ఇజ్రాయెల్‌లో 300 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ చేసిన ప్రతిదాడిలో గాజాలో 230మందికి పైగా మృతి చెందారు. హమాస్ మిలిటెంట్ల దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిన బూనారు. అంతేకాదు.. శనివారాన్ని 'బ్లాక్ డే'గా ప్రకటిచారు. తమ సైన్యం పూర్తి శక్తితో గాజాలోని హమాస్ తీవ్రవాదులపై దాడి చేస్తుందని వివరించారు. హమాస్ స్థావరాలను నాశనం చేయడానికి తమ సైన్యం తన శక్తినంతా ఉపయోగించుకుంటోందని వెల్లడించారు.
ఇజ్రాయెల్ పౌరులను ఊచకోత కోస్తున్న హమాస్ మిలిటెంట్లు
హమాస్ మిలిటెంట్లు డజన్ల కొద్దీ ఇజ్రాయెల్ సైనికులను తమ ఆధీనంలోకి తీసుకొని కిరాతకంగా చంపారు. దీంతో శనివారం ఇజ్రాయెల్ సైన్యం గణనీయమైన నష్టాలను చవిచూసింది. అలాగే, హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోని ఇళ్లలోకి చొరబడి పౌరులను ఊచకోత కోశారు. వందలాది మంది హమాస్ మిలిటెంట్లు తమ దేశంలోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి రిచర్డ్ హెచ్ట్ చెప్పారు. ఇదిలా ఉంటే, పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదివారం అత్యవసరం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌కు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. హమాస్ గ్రూప్‌కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.