Israel-Hamas: గాజా రహస్య పత్రాలు లీక్.. ఇజ్రాయెల్ రాజకీయాలను కుదిపేస్తోన్న వ్యవహారం
ఈ వార్తాకథనం ఏంటి
హమాస్,హెజ్‌బొల్లా గ్రూపులను మట్టికరించాలన్న లక్ష్యంతో ఉన్న బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వాన్ని.. గాజా కీలక దస్త్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తోంది.
ప్రధాని సన్నిహితుల ద్వారా ఈ రహస్య సమాచారం లీక్ అయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఈ సమాచారాన్ని పీఎంఓలో పనిచేస్తోన్న అధికారిక ప్రతినిధి ఎలిఫెల్డ్‌స్టెయిన్ అందించినట్లు పేర్కొన్నాయి.
ఈ లీకేజీకి సంబంధించి భద్రతా సంస్థల్లో పనిచేస్తోన్న మరికొందరు వ్యక్తులు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు, అయితే వారి పేర్లు ఇంకా వెల్లడించలేదు.
ఈ లీకేజీ బందీలను విడిపించే ప్రక్రియకు తీవ్రమైన ఆటంకం కలిగించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.
దీంతో, బందీల కుటుంబాలు నెతన్యాహు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
వివరాలు
ఇజ్రాయెల్‌లో గందరగోళం
అయితే, నెతన్యాహు తన కార్యాలయంలో ఎలాంటి తప్పు జరగలేదని.. ఈ లీకేజీ గురించి తనకు సమాచారం మీడియా ద్వారా మాత్రమే తెలుసుకున్నట్టు చెప్పారు.
సెప్టెంబర్‌లో, హమాస్ చెరలో ఉన్న ఆరుగురు బందీల మృతదేహాలను దక్షిణ గాజాలోని రఫాలో గుర్తించారు.
ఈ సంఘటన ఇజ్రాయెల్‌లో గందరగోళం సృష్టించింది, నెతన్యాహు పై విపక్షాలు, బందీల కుటుంబాలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి.
కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడానికి నెతన్యాహు కారణమని విమర్శిస్తున్నారు.
అనంతరం, ఆ కీలక సమాచారాన్ని యూరోపియన్ మీడియా సంస్థ ఒకటి ప్రచురించింది, ఇందులో హమాస్ చర్చల వ్యూహం వెల్లడించారు.
వివరాలు
హమాస్ చేతిలో ఇంకా బందీలుగానే 101 మంది
గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడం వల్ల సుమారు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు.
251 మంది మిలిటెంట్ సంస్థ చేత బందీగా తీసుకెళ్లబడ్డారు. ఈ నేపథ్యంలో, ఇజ్రాయెల్ చేసిన ప్రతిదాడిలో గాజాలో 43,000 మంది ప్రజలు మరణించారు.
తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో కొంత మంది బందీలను విడుదల చేశారు, కానీ ఇంకా 101 మంది హమాస్ చేతిలో ఇంకా బందీలుగానే ఉన్నారు.
పలు సంఘటనలలో కొందరు బందీలు మరణించగా, ప్రస్తుతం 51 మంది మాత్రమే సజీవంగా ఉన్నారని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది.
నెతన్యాహు బందీల జీవితాలతో గేమ్ ఆడుతున్నారని మరో మీడియా సంస్థ తీవ్రంగా ఆరోపించింది.