Israel's election: ఇజ్రాయెల్‌లో రాజకీయ ప్రతిష్ఠంభన.. నెతన్యాహు ముందున్న నాలుగు దారులివే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఏ రాజకీయ కూటమికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. దీంతో ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారా? లేక ప్రతిపక్షాలన్నీ ఏకమై ఆయనను పదవి నుంచి దించుతాయా? అనే చర్చ మొదలైంది. ఈ పరిణామాల మధ్య అరబ్ పార్టీల మద్దతు కీలకంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీల పాత్ర ఏ స్థాయిలో ఉండబోతోంది? నెతన్యాహు తన అధికారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయవచ్చు? ఇజ్రాయెల్‌లో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు పరిష్కార మార్గాలేంటో తెలుసుకుందాం.
వివరాలు
ఎన్నికల్లో ఏ కూటమికీ దక్కని మెజార్టీ
120 మంది సభ్యులున్న ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం.
అయితే తాజా ఎన్నికల్లో ఏ కూటమికీ ఈ మెజార్టీ దక్కలేదు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని అధికార కూటమికి 53 స్థానాలు వచ్చాయి.
ఇందులో ఆయనకు చెందిన లికుడ్ పార్టీ 27 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది.
మాజీ సైన్యాధిపతి గడీ ఐసెన్‌కోట్ నాయకత్వంలోని ప్రతిపక్ష కూటమికి 48 స్థానాలు లభించాయి. మరోవైపు అరబ్ పార్టీలకు కలిపి 19 సీట్లు వచ్చాయి.
ఈ లెక్కలతో చూస్తే ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రధానంగా నాలుగు అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
1. ఐక్యతా ప్రభుత్వం
ప్రతిపక్ష కూటమిలో గడీ ఐసెన్‌కోట్ నాయకత్వంలోని 'యాష్నర్' పార్టీ 21 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది.
మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌కు చెందిన 'టుగెదర్' పార్టీకి 12 సీట్లు వచ్చాయి.
మరో ప్రతిపక్ష నేత అవిగ్డోర్ లిబర్‌మ్యాన్ పార్టీ ఏడు స్థానాలను గెలుచుకుంది.
ఈ మూడు పార్టీలతో నెతన్యాహు చేతులు కలిపితే ఐక్యతా ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది.
అయితే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం అంత సులభం కాదు. నెతన్యాహును అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించాయి.
మరోవైపు నెతన్యాహు కూడా ఈ సంప్రదాయ పార్టీలతో మొదటి నుంచీ విభేదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు వర్గాలు కలిసి పనిచేయడం కష్టమేనని భావిస్తున్నారు.
వివరాలు
1. ఐక్యతా ప్రభుత్వం
అయితే పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రాజకీయ పార్టీలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టే అవకాశాలనూ కొందరు విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.
దేశ భద్రత, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఐక్యతా ప్రభుత్వ ఏర్పాటుపై చర్చకు అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
2. ప్రతిపక్ష పార్టీల నుంచి ఫిరాయింపులు జరిగితే?
ప్రస్తుత లెక్కల ప్రకారం నెతన్యాహు కూటమి మెజార్టీకి మరో ఎనిమిది స్థానాల దూరంలో ఉంది.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలతో నేరుగా పొత్తు పెట్టుకోవడం కంటే.. ఆ కూటమిలోని కొందరు సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు ఆయన ప్రయత్నించే అవకాశాలున్నాయి.
దీర్ఘకాల రాజకీయ అనుభవం ఉన్న నెతన్యాహుకు ఇలాంటి రాజకీయ పరిణామాలు కొత్తేమీ కాదు.
గతంలోనూ సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో ఆయన అనేక వ్యూహాలు అనుసరించారు.
ఇప్పుడు కూడా నఫ్తాలీ బెన్నెట్, అవిగ్డోర్ లిబర్‌మ్యాన్‌కు చెందిన పార్టీల్లోని కొందరు నేతలు నెతన్యాహు కూటమికి మద్దతు ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఈ ఫిరాయింపులు నిజమైతే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని ఆయన సాధించే అవకాశం ఉంటుంది.
వివరాలు
3. అరబ్ పార్టీల మద్దతు కీలకమవుతుందా?
నెతన్యాహును అధికారానికి దూరం చేయాలని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా నిర్ణయించుకుంటే అరబ్ పార్టీల మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది.
అరబ్ పార్టీలకు ఉన్న 19 స్థానాల మద్దతుతో గడీ ఐసెన్‌కోట్ ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
అదే జరిగితే ఇజ్రాయెల్ ప్రభుత్వంలోనే కాకుండా.. దేశ విధాన నిర్ణయాల్లోనూ అరబ్ పార్టీల పాత్ర కీలకంగా మారుతుంది.
అయితే ఈ ప్రతిపాదనకు ప్రతిపక్ష కూటమిలోనే భిన్నాభిప్రాయాలున్నాయి.
2023 అక్టోబరు 7న జరిగిన దాడుల నేపథ్యంలో అరబ్ పార్టీలతో నేరుగా పొత్తు పెట్టుకోవడంపై కూటమిలోని నాలుగు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
అందువల్ల అరబ్ పార్టీలను ప్రభుత్వంలో భాగస్వాములుగా చేసుకోకుండా, బయట నుంచి మద్దతు తీసుకునే మార్గాన్ని కూడా పరిశీలించవచ్చు.
వివరాలు
3. అరబ్ పార్టీల మద్దతు కీలకమవుతుందా?
ఈ విధంగా అరబ్ పార్టీల మద్దతుతో ఐసెన్‌కోట్ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది.
మరోవైపు ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చేందుకు అరబ్ పార్టీలు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ రాజకీయ చరిత్రలో అరబ్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సందర్భం ఒక్కటే.
2021లో నెతన్యాహును అధికారానికి దూరం చేయాలనే లక్ష్యంతో నఫ్తాలీ బెన్నెట్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది.
ఈ కూటమిలో 'రామ్' అనే అరబ్ పార్టీ కూడా భాగస్వామిగా ఉంది.
అయితే ఆ ప్రభుత్వం కేవలం 18 నెలలకే కూలిపోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు మళ్లీ అధికారంలోకి వచ్చారు.
వివరాలు
4. మళ్లీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి వస్తుందా?
ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి తగినంత మద్దతు లభించకపోతే చివరి అవకాశంగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రత్యేక గడువులతో కూడిన విధానం ఉంది.
మొదట పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా నిలిచిన కూటమికి అధ్యక్షుడు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారు.
ఆ పార్టీకి మెజార్టీ నిరూపించుకునేందుకు 28 రోజుల గడువు ఉంటుంది. అవసరమైతే మరో 14 రోజులు పొడిగిస్తారు.
ఈ సమయంలోనూ మెజార్టీ సాధించలేకపోతే రెండో అతిపెద్ద పార్టీకి అవకాశం ఇస్తారు. ఆ పార్టీకి కూడా 28 రోజుల సమయం ఉంటుంది.
రెండో పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైతే మూడో నేతకు 14 రోజుల గడువు కల్పిస్తారు.
వివరాలు
8 ఏళ్లలో 7 ఎన్నికలు..
ఈ ప్రయత్నాలన్నీ విఫలమై రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగితే దేశంలో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని అధ్యక్షుడు ఆదేశిస్తారు.
ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు 12 వారాల సమయం పట్టొచ్చు. అప్పటివరకు ప్రస్తుత ప్రధాని నెతన్యాహు ఆపద్ధర్మ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు.
ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ఇలాంటి ప్రతిష్ఠంభనలు కొత్త కాదు. గత ఎనిమిదేళ్లలో వివిధ రాజకీయ కారణాలతో ఏడుసార్లు ఎన్నికలు జరగడం అక్కడి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది.
ఇందుకు ప్రధాన కారణాల్లో ఆ దేశ ఎన్నికల విధానం కూడా ఒకటి.
వివరాలు
8 ఏళ్లలో 7 ఎన్నికలు..
ఇజ్రాయెల్‌లో దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు.
దేశం మొత్తాన్ని ఒకే నియోజకవర్గంగా పరిగణిస్తారు. ప్రజలు వ్యక్తిగత అభ్యర్థులకు కాకుండా రాజకీయ పార్టీలకు ఓటు వేస్తారు.
పార్లమెంటులో ప్రాతినిధ్యం పొందాలంటే ఒక పార్టీకి కనీసం 3.25 శాతం ఓట్లు రావాలి. పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి పార్లమెంటులో సీట్లు కేటాయిస్తారు.
దీంతో అనేక చిన్న పార్టీలు కూడా పార్లమెంటులో ప్రాతినిధ్యం పొందే అవకాశం ఉంటుంది.
అయితే ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల మద్దతు తప్పనిసరవుతుంది.
మరోవైపు బెంజమిన్ నెతన్యాహు 1996 నుంచి ఇప్పటివరకు వేర్వేరు విడతల్లో మొత్తం 19 ఏళ్లపాటు ఇజ్రాయెల్ ప్రధానిగా పనిచేశారు.
వివరాలు
8 ఏళ్లలో 7 ఎన్నికలు..
ఇటీవలి కాలంలో ఆయనపై అవినీతి సహా పలు ఆరోపణలు వచ్చాయి.
ఒకవేళ ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకుంటే అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో నెతన్యాహు తన కూటమికి అవసరమైన మద్దతును ఎలా కూడగట్టుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రతిపక్షాలు ఏకమవుతాయా? అరబ్ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయా? లేక ఇజ్రాయెల్ మరోసారి ఎన్నికలకు వెళ్తుందా? అన్నది రానున్న రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంది.