LOADING...
Iran-Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోని నెతన్యాహు
ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోని నెతన్యాహు

Iran-Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోని నెతన్యాహు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2026
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ (Iran) - ఇజ్రాయెల్ (Israel) మధ్య ఏప్రిల్‌ 8 తర్వాత మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేపట్టిన దాడులకు ప్రతీకారంగా ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇరాన్ ప్రతిదాడులు ప్రారంభించింది. ఉత్తర ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని దాదాపు 10 క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) వెల్లడించాయి. అంతేకాకుండా, ఇరాక్‌లోని కొన్ని ప్రాంతాలపై కూడా దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ప్రకటించింది.

వివరాలు

ఎదురుదాడి చేయొద్దని ట్రంప్ సూచన

ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. శాంతి ఒప్పందానికి ఇరు దేశాలు చాలా దగ్గరగా ఉన్నాయని ట్రంప్ పేర్కొంటూ, పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేయకుండా చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచించారు. "ఇప్పటికే క్షిపణులు ప్రయోగించారు. ఇక చర్చల బాట పట్టాలని ఇరాన్‌కు ట్రంప్ సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నెతన్యాహును ఉద్దేశించి మాట్లాడుతూ, "ఇరాన్ దాడుల్లో పెద్దగా నష్టం జరగలేదు. ఇజ్రాయెల్ ప్రతిదాడికి దిగదని ఆశిస్తున్నాను. ఒకవేళ బీబీ (నెతన్యాహు) ఎదురుదాడి చేస్తే గత 47 ఏళ్లుగా కొనసాగుతున్న ఘర్షణలే మరింత తీవ్రంగా కొనసాగుతాయని వ్యాఖ్యానించారు.

వివరాలు

ట్రంప్ మాటలను లెక్కచేయని ఇజ్రాయెల్

అయితే ట్రంప్ సూచనలను పక్కనపెట్టి ఇజ్రాయెల్ సోమవారం ఉదయం ఇరాన్‌పై భారీ ప్రతిదాడులు ప్రారంభించింది. పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) విస్తృత స్థాయిలో దాడులు చేపట్టింది. రాజధాని టెహ్రాన్‌లో పలుచోట్ల భారీ పేలుళ్లు సంభవించగా, తబ్రిజ్, ఇస్ఫహాన్ తదితర నగరాలు కూడా పేలుళ్లతో దద్దరిల్లినట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో ఇరాన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి.

Advertisement

వివరాలు

గగనతలం మూసివేసిన ఇరాన్

ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన వెంటనే ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. మరోవైపు, ఇరాన్ దాడుల నేపథ్యంలో ఖతార్, సిరియా దేశాలు కూడా ఇప్పటికే తమ గగనతలాలను తాత్కాలికంగా మూసివేశాయి. ఇజ్రాయెల్ ఎయిర్-లాంచ్ బాలిస్టిక్ క్షిపణులను వినియోగించి దాడులు జరిపిందని ఇరాన్ ఆరోపించింది. తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement