యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు.. కానీ మేమే పూర్తి చేస్తాం: హమాస్‌కు ఇజ్రాయెల్ హెచ్చరిక
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ - ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం నడుస్తోంది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా స్పందించారు. యుద్ధాన్ని తాము కోరి తెచ్చుకోలేదని, తాము ప్రారంభించలేదని పేర్కొన్నారు. అత్యంత క్రూరమైన ఈ చర్యను తమ దేశంపై బలవంతంగా ప్రయోగించారని మండిపడ్డారు. ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ ప్రారంభించనప్పటికీ, తమ దేశమే పూర్తి చేస్తుందని నెతన్యాహు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌పై దాడి చేసి చారిత్రక తప్పిదం చేసినట్లు హమాస్ బాధపడే పరిస్థితి వస్తుందని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా మంగళవారం నాటికి ఇరు దేశాల్లో 1600మందికి పైగా మృతి చెందారు.
హమాస్ జరిపిన క్రూరమైన దాడులు మనసును కలిచివేస్తున్నాయ్: నెతన్యాహు
ఒకప్పుడు యూదు ప్రజలు దేశం లేనివారని, అప్పుడు వారికి రక్షణ కూడా సరిగా లేదని, అయితే ఇప్పుడు రోజులు మారాయని నెతన్యాహు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇజ్రాయెల్ కొట్టబోయే దెబ్బను శత్రువులు రాబోయే దశాబ్దాలపాటు గుర్తు ఉంచుకుంటారని పేర్కొన్నారు. అమాయక ఇజ్రాయెల్ ప్రజలపై హమాస్ జరిపిన క్రూరమైన దాడులు మనసును కలిచివేస్తున్నాయని ఆయన అన్నారు. ఇళ్లలోకి చొరబడి ఊచకోత కోయడం, వందలాది మందిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం, అనేక మంది స్త్రీలు, పిల్లలు, వృద్ధులను కిడ్నాప్ చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హమాస్‌ను రూపుమాపడానికి మిత్రదేశాల మద్దతు కావాలని ఆయన అన్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపిన దేశాలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.