LOADING...
Israel-Hamas: ఇజ్రాయెల్ కఠిన చర్య.. గాజాలో విద్యుత్ కట్, నీటి సంక్షోభం తీవ్రతరం
ఇజ్రాయెల్ కఠిన చర్య.. గాజాలో విద్యుత్ కట్, నీటి సంక్షోభం తీవ్రతరం

Israel-Hamas: ఇజ్రాయెల్ కఠిన చర్య.. గాజాలో విద్యుత్ కట్, నీటి సంక్షోభం తీవ్రతరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 10, 2025
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

గాజా-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏడాదికిపైగా ఇజ్రాయెల్‌ దాడుల ధాటికి గాజా సర్వనాశనం అయ్యింది. ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తుల జోక్యంతో కొంతవరకు పరిస్థితులు సద్దుమణిగినట్లు కనిపించినా, తాజా పరిణామాలు మళ్లీ ఉద్రిక్తతలను తలెత్తిస్తున్నాయి. ఇటీవల హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత ఒప్పందం ముగిసింది. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల్లో కొందరిని మాత్రమే విడుదల చేయడంతో ఇజ్రాయెల్ అసంతృప్తిగా ఉంది. అందువల్ల ఒప్పందాన్ని కొనసాగించాలని, మిగిలిన బందీలను కూడా విడదల చేయాలని ఇజ్రాయెల్ ఒత్తిడి పెంచింది. అయితే హమాస్ దీనికి అంగీకరించకపోవడంతో, గాజాకు వెళ్లే సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది. దీంతో నిత్యావసరాల సరఫరా నిలిచిపోవడంతో ఆహార సంక్షోభం తలెత్తింది.

Details

పనిచేయని నీటి శుద్ది ఫ్లాంట్లు

తాజాగా ఇజ్రాయెల్ మరొక కఠిన నిర్ణయం తీసుకుంది. గాజాకు సరఫరా అయ్యే విద్యుత్‌ను పూర్తిగా నిలిపివేసింది. దీని కారణంగా గాజాలో అంధకారం అలముకోవడంతో పాటు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లన్నీ పని చేయడం మానేశాయి. ఇది ఆకలి, తాగునీటి కొరతను మరింత తీవ్రమయ్యేలా చేసింది. హమాస్ ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని ఆరోపించింది. రెండో దశ ఒప్పందం కోసం చర్చలు ప్రారంభించాలని హమాస్ డిమాండ్ చేసింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం తొలి దశ ఒప్పందాన్ని ఏప్రిల్‌ వరకు కొనసాగించాలంటూ పట్టుబడుతోంది. గతేడాది అక్టోబర్ 7న హమాస్‌ ఆకస్మిక దాడి చేసి, ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోతోంది.

Details

వేలాదిమంది పాలస్తీనియన్లు మృతి

హమాస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్ ఘాటైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో గాజాలో వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హమాస్‌ను తీవ్రంగా హెచ్చరించారు. బందీలను వెంటనే విడదల చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతేకాకుండా, గాజాను ఖాళీ చేసి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అయితే ట్రంప్‌ వ్యాఖ్యలను అరబ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్‌ ఇదే సందేశాన్ని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం హమాస్‌పై ఇజ్రాయెల్, అమెరికా ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ మధ్యవర్తులు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఏ మేరకు ముందుకు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.