Loading...
Israel: గాజా సరిహద్దులో భారీ మట్టిగోడ.. ఇజ్రాయెల్‌ వ్యూహంపై ఆందోళనలు
గాజా సరిహద్దులో భారీ మట్టిగోడ.. ఇజ్రాయెల్‌ వ్యూహంపై ఆందోళనలు

Israel: గాజా సరిహద్దులో భారీ మట్టిగోడ.. ఇజ్రాయెల్‌ వ్యూహంపై ఆందోళనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2026
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరోవైపు గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్‌ తన వ్యూహాన్ని మరింత వేగవంతం చేస్తోంది. గత ఏడాది అక్టోబరులో హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా నిర్ణయించిన తాత్కాలిక సరిహద్దు వెంబడి భారీ మట్టిగోడ నిర్మాణాన్ని చేపట్టింది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఇప్పటికే దాదాపు 23 కిలోమీటర్ల మేర ఈ గోడ నిర్మాణం పూర్తయినట్లు కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే గాజాలో సుమారు సగం ప్రాంతంపై ఇజ్రాయెల్‌ నియంత్రణ మరింత బలపడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వివరాలు 

తాత్కాలిక సరిహద్దు స్థానంలో కొత్త భద్రతా వ్యవస్థ

హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో నిర్ణయించిన సరిహద్దు తాత్కాలికమే. అయితే ప్రస్తుతం అదే ప్రాంతంలో ఇజ్రాయెల్‌ శాశ్వత భద్రతా ఏర్పాట్ల దిశగా అడుగులు వేస్తోంది.

మట్టిగోడతో పాటు నిఘా వ్యవస్థలు, గూఢచార పరికరాలు, భద్రతా కేంద్రాలతో కూడిన ప్రత్యేక సెక్యూరిటీ జోన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

దక్షిణ గాజాలోని రఫా, మువాసి ప్రాంతంలో జూలై 1 నాటికి కేవలం అర కిలోమీటరు మేర ఉన్న మట్టిగోడ, కేవలం 15 రోజుల్లోనే 2.4 కిలోమీటర్లకు విస్తరించింది.

అలాగే గాజా సమీపంలోని ఖాన్‌ యూనిస్‌ వద్ద ఏకంగా 17 కిలోమీటర్ల పొడవున మట్టిగోడను యుద్ధ ప్రాతిపదికన నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి.

వివరాలు 

శాశ్వత సరిహద్దుగా మారుతుందనే భయం

యుద్ధంతో శిథిలాలుగా మారిన పాలస్తీనా గ్రామాలపై కొత్త రహదారులు, సైనిక స్థావరాలు, భద్రతా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఇజ్రాయెల్‌ తన మౌలిక వసతులను విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మట్టిగోడను చొరబాట్లను అడ్డుకునేందుకు మాత్రమే నిర్మిస్తున్నామని ఇజ్రాయెల్‌ చెబుతోంది.

అయితే ఇది భవిష్యత్తులో శాశ్వత సరిహద్దుగా మారే ప్రమాదం ఉందని పాలస్తీనీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అలాంటి పరిస్థితి ఏర్పడితే గాజా ప్రజల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు.

కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్‌ పూర్తిగా వెనక్కు తగ్గి,అనంతరం అంతర్జాతీయ భద్రతా సంస్థల ఆధ్వర్యంలో గాజా ప్రాంత పర్యవేక్షణ కొనసాగుతుందని భావించినప్పటికీ, ప్రస్తుతం ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

ADVERTISEMENT

వివరాలు 

దాడుల్లో కొనసాగుతున్న ప్రాణనష్టం

అంతేకాదు, కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక, భూదాడులు కొనసాగుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

కాల్పుల విరమణ తర్వాత ఇప్పటివరకు జరిగిన దాడుల్లో సుమారు 1,100 మంది పాలస్తీనీయులు మరణించినట్లు సమాచారం.

మరోవైపు ఉగ్రవాదుల దాడుల్లో ఐదుగురు ఇజ్రాయెల్‌ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా మంగళవారం గాజా నగరంపై జరిగిన వైమానిక దాడిలో ఫిరాసల్‌ మస్రీతో పాటు ఆయన భార్య, నలుగురు పిల్లలు మరణించినట్లు షిఫా ఆసుపత్రి ప్రకటించింది.

ఈ ఘటనలో ఇల్లు మొత్తం మంటల్లో చిక్కుకుపోగా తమను కాపాడాలని చిన్నారులు అరుస్తున్న శబ్దాలు వినిపించాయని మస్రీ సోదరుడు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారీ ప్రాణనష్టం

2023 అక్టోబర్‌ 7న హమాస్‌ ఇజ్రాయెల్‌పై జరిపిన దాడిలో సుమారు 1,200 మంది మరణించారు.

ఆ ఘటనతో ప్రారంభమైన తాజా ఘర్షణల్లో ఇప్పటివరకు గాజాలో సుమారు 73 వేల మంది మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు సూచిస్తున్నాయి.

ADVERTISEMENT