Israel: ఇజ్రాయెల్ భూతల దాడులు.. లెబనాన్ సరిహద్దుల్లోని హెజ్బొల్లా స్థావరాలపై దృష్టి
గత రెండు వారాలుగా లెబనాన్‌పై గగనతలం నుంచి విరుచుకుపడిన ఇజ్రాయెల్, తాజాగా భూతల యుద్ధాన్ని ప్రారంభించింది. ఇరాన్ మద్దతుతో కూడిన హెజ్బొల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) లెబనాన్‌లో పరిమిత భూతల దాడులను చేపట్టింది. దీనికి సంబంధించిన సమాచారం మిత్రదేశమైన అమెరికాకు అందించారు. ఉత్తర ప్రాంతంలోని ఇజ్రాయెల్ పౌరులకు తక్షణ ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో, IDF దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకొని సరిహద్దు గ్రామాల వద్ద పరిమితంగా దాడులు నిర్వహించిందని ప్రకటించింది. ఈ దాడుల సమాంతరంగా, గాజా, ఇతర ప్రాంతాల్లోనూ శత్రువులతో పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు.
ఇప్పటివరకూ వెయ్యి మంది మృతి
ఇజ్రాయెల్ ఇప్పటికే కొన్ని రోజులుగా లెబనాన్‌పై వైమానిక దాడులు చేస్తోంది. శనివారం, లెబనాన్ రాజధాని బీరుట్‌పై జరిపిన దాడుల్లో హెజ్బొల్లా అధినేత సయ్యద్ హసన్ నస్రల్లా, మరో కీలక నేత నబిల్ కౌక్ హతమైన విషయం తెలిసిందే. హెజ్బొల్లా డిప్యూటీ లీడర్ నయిమ్ ఖాసీమ్, ఇజ్రాయెల్ భూతల దాడులు ప్రారంభించినా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నస్రాల మృతి తర్వాత తొలిసారి టెలివిజన్‌లో మాట్లాడిన ఖాసీమ్, లెబనాన్ సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ దళాలను లక్ష్యంగా చేసుకోవాలని చెప్పారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.