LOADING...
Israel: గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్‌ మంత్రివర్గం ఆమోదం 
గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్‌ మంత్రివర్గం ఆమోదం

Israel: గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్‌ మంత్రివర్గం ఆమోదం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు 22 నెలలుగా ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజాపై పూర్తి ఆధిపత్యం సాధించే ప్రణాళికకు ఇజ్రాయెల్‌ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. గాజాను స్వాధీనం చేసుకోవాలనే ప్రతిపాదనకు సెక్యూరిటీ క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా,ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఐడీఎఫ్‌(IDF)దళాలు సిద్ధమవుతున్నాయని పేర్కొంది. అలాగే, యుద్ధభూమికి వెలుపల ఉన్న పౌరులకు మానవతా సహాయం అందించే కార్యక్రమాలు కూడా కొనసాగనున్నాయని వివరించింది. ఈ చర్య, హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న వారిని రక్షించే ప్రణాళికలో భాగమని స్పష్టం చేసింది. అయితే, ఈ ప్రణాళికకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉందని తెలిపింది.

వివరాలు 

ఐడీఎఫ్‌ నియంత్రణలో గాజాలో సుమారు 75 శాతం భూభాగం

ఈ నిర్ణయానికి ముందు నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ.. గాజాను స్వాధీనం చేసుకోవడం తమ తుది లక్ష్యం కాదని అన్నారు. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించి,బందీలను రక్షించుకుని,ఆ ప్రాంతాన్ని తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 61 వేల మందికి పైగా మృతిచెందారు. గాజాలో సుమారు 75 శాతం భూభాగం ఇప్పటికే ఐడీఎఫ్‌ నియంత్రణలో ఉంది.

వివరాలు 

ఐడీఎఫ్‌లో వ్యతిరేక స్వరాలు 

తాజా ప్రణాళిక ప్రకారం, మిగిలిన భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే, ఈ చర్యపై ఐడీఎఫ్‌లోనే వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. బందీల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలాగే, హమాస్‌ మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేయడానికి అనేక సంవత్సరాలు పట్టవచ్చని అంచనా వేస్తోంది. ఈ అభ్యంతరాలను పక్కన పెట్టి, సెక్యూరిటీ క్యాబినెట్‌ గాజా స్వాధీనానికి తుది ఆమోదం తెలిపింది.