LOADING...
Israel-Iran: ఇజ్రాయెల్‌ క్షిపణి దాడి.. టెహ్రాన్‌లో 29 మంది చిన్నారులతో సహా 60 మంది మృతి
ఇజ్రాయెల్‌ క్షిపణి దాడి.. టెహ్రాన్‌లో 29 మంది చిన్నారులతో సహా 60 మంది మృతి

Israel-Iran: ఇజ్రాయెల్‌ క్షిపణి దాడి.. టెహ్రాన్‌లో 29 మంది చిన్నారులతో సహా 60 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఆదివారం నాటికి మరింత తీవ్రమయ్యాయి. శనివారం రాత్రి నుంచి రెండు దేశాలు పరస్పరం దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు తలెత్తే ముప్పు స్పష్టంగా కనిపిస్తోంది. 'ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌' పేరిట ఇజ్రాయెల్‌ చేపట్టిన వైమానిక దాడుల్లో ప్రపంచంలో అతిపెద్దవైన ఇరాన్‌కు చెందిన గ్యాస్‌ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుంది. వ్యూహాత్మక ఆస్తులపై దాడులతో ఇజ్రాయెల్‌ తన చర్యలను మరింత విస్తరించింది. టెహ్రాన్‌లోని ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడికి పాల్పడడంతో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 29 మంది చిన్నారులతో సహా కనీసం 60 మంది మృతి చెందినట్లు ఇరాన్‌ అధికార వర్గాలు వెల్లడించాయి.

Details

మొదటి, రెండ్రోజుల్లో 78 మంది మృతి

మొదటి రెండు రోజుల్లోనే ఇజ్రాయెల్‌ దాడుల్లో మొత్తం 78 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ దాడుల్లో ధ్వంసమైన భవనాల ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో విస్తృతంగా వైరల్‌ అయ్యాయి. అంతకుముందు ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఓ ఇంటి సమీపంలో జరిగిన దాడిలో ముగ్గురు మహిళలు మరణించగా, పది మంది గాయపడ్డారు. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్‌ పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించింది. గెలీలీ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌ భవనంపై క్షిపణి పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్‌ అత్యవసర సేవల విభాగం తెలిపింది. ప్రధానంగా అణు కేంద్రాలు, సైనిక వసతులు, కీలక వ్యక్తులే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు భారీ దాడులకు ఆదేశించారు.

Details

డ్రోన్లతో ఇజ్రాయెల్ పై దాడి

నతాంజ్‌, ఇస్ఫహాన్‌ సహా 150కి పైగా ప్రదేశాలపై జరిగిన దాడుల్లో తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు, పలువురు సీనియర్‌ సైనికాధికారులు మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటి దాకా వారు అనుభవించింది చాలా చిన్నది. రాబోయే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని నెతన్యాహు హెచ్చరించారు. మరోవైపు ఇరాన్‌ నాలుగు విడతలుగా దాదాపు 200 బాలిస్టిక్‌ క్షిపణులు, అనేక డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. వాటిలో చాలావరకు అమెరికా రక్షణ వ్యవస్థల సహాయంతో ఎదుర్కొన్నప్పటికీ, కనీసం ముగ్గురు మృతిచెందగా, అనేక మంది గాయపడ్డారు. తమ క్షిపణులను అడ్డుకునే విదేశీ సైనిక స్థావరాలపై కూడా టార్గెట్‌ చేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌-అమెరికా మధ్య జరగాల్సిన అణు చర్చలు నిలిపివేశారు.

Details

దాడుల నేపథ్యంలో చర్చలు కొనసాగించడం అనర్హం

ఈ విషయాన్ని ఒమన్‌ అధికారికంగా ధృవీకరించింది. "ఇజ్రాయెల్‌ నడిపిస్తున్న వైమానిక దాడుల నేపథ్యంలో చర్చలు కొనసాగించడం అనర్హం" అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఖ్చీ అన్నారు. వాషింగ్టన్‌ మౌనం కూడా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తోందన్న వాదనను ఇరాన్‌ అధికార ప్రతినిధులు వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా కూడా ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారతదేశం 'చర్చలు, దౌత్యం' ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మరోవైపు, చైనా నేతృత్వంలోని SCO ఈ దాడులను తీవ్రంగా ఖండించినప్పటికీ, భారత్‌ మాత్రం గట్టి మూడ్‌ తీసుకోకుండా సంయమనం పాటించాలని సూచించింది.