Iran- Israel: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు
ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ క్షిపణి దాడులు చేపట్టింది. ఈ నేపథ్యంలో దానికి ప్రతీకారంగా టెల్ అవీవ్ స్పందిస్తూ, ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దళాలు టెహ్రాన్ సమీపంలోని వివిధ స్థావరాలపై దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్, దాని మద్దతుదారులు చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని, తమ దేశం, ప్రజల రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి డేనియల్ హగారీ పేర్కొన్నారు. జనరల్ స్టాఫ్ చీఫ్ ఎల్‌టీజీ హెర్జి హలేవీ నేతృత్వంలో ఈ ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. మేజర్ జనరల్ టోమర్ బార్‌తో కలిసి క్యాంప్ రాబిన్ నుండి ఈ దాడులను పర్యవేక్షించారు.
విమాన రాకపోకలపై ప్రభావం
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న తాజా ఘర్షణల్లో అమెరికా ఎలాంటి పాత్రలోనూ లేదని, ఇజ్రాయెల్ దాడులకు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, తాము దూరంగా ఉన్నామని అమెరికా ప్రతినిధి పేర్కొన్నారు. ఇక ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా ఇరాక్ తన గగనతలంలో పౌర విమానయాన భద్రతను కాపాడేందుకు అన్ని విమానాశ్రయాల్లో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ 1న, ఇరాన్ భారీ బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్షిపణుల్లో కొన్ని అత్యంత సమీప లక్ష్యాల వద్ద పేలినప్పటికీ, మిగిలిన వాటిని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకోవడంతో ఆ విధ్వంసం కాస్త తగ్గినట్లు సమాచారం.