Japan: జపాన్‌లో విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త పథకం.. 'ఒక్క రోజు విద్యార్థి' ఫీజు రూ.17 వేలు !
ఆసియాలో అత్యుత్తమ విద్యను అందించే దేశాల్లో జపాన్ ఒకటిగా పేరు పొందింది. జపాన్ అనుసరించే ప్రత్యేక విద్యావిధానాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విద్యతో పాటు సమాజానికి సంబంధించిన బాధ్యతలు, నైతిక విలువలు, క్రమశిక్షణ, కష్టపడే తత్వం వంటి అంశాలను చిన్న వయసు నుంచే విద్యార్థులకు నేర్పించడం జపాన్ విద్యా విధానంలోని ప్రత్యేకత. విదేశీయులు జపాన్ పాఠశాలలపై చూపిస్తున్న ఆసక్తిని గమనించి, ఓ జపాన్ సంస్థ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.
30 మందికి మాత్రమే అవకాశం
ఉండోకయ (Undokaiya) అనే సంస్థ విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. జపాన్‌కు వచ్చే పర్యాటకులు రూ.17వేలు చెల్లించి ఒక రోజంతా జపాన్ మాధ్యమిక పాఠశాలలో విద్యార్థుల అనుభవాన్ని పొందవచ్చు. ఈ ప్యాకేజీలో కాలిగ్రఫీ, కటాన ఫైటింగ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ వంటి కార్యక్రమాలను పాల్గొనవచ్చు. దీని కోసం తూర్పు జపాన్‌లోని ఛిబా ప్రిపెక్షర్‌లో మూసివేసిన ఒక పాఠశాలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా చేరవచ్చని, ప్రతిరోజూ కేవలం 30 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని సంస్థ పేర్కొంది.
గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్
పాఠశాల వాతావరణాన్ని అనుసరించి పర్యాటకులు యూనిఫాం లేదా సంప్రదాయ కిమోనో ధరించవచ్చు. జపనీస్ భాషలో కాలిగ్రఫీ, నృత్యం, అత్యవసర ప్రతిస్పందన నైపుణ్యాలు బోధిస్తారు. జపాన్‌లో తరచూ భూకంపాలు సంభవించే కారణంగా, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తమను తాము రక్షించుకునే పద్ధతులను కూడా పాఠాల్లో బోధిస్తారు. పాఠశాల ముగిసిన తర్వాత తమ తరగతిని శుభ్రం చేయడం విద్యార్థులపై సమాజానికి బాధ్యతను గుర్తుచేసే సాధనంగా పేర్కొన్నారు. చివరగా, జపాన్ పాఠశాలలో ఒక రోజు విద్యార్థిగా అనుభవం పొందిన గుర్తుగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్‌ను అందజేస్తామని చెప్పారు.