LOADING...
JD Vance: యుద్ధ వివరాలపై గందరగోళం.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ ఆందోళన
యుద్ధ వివరాలపై గందరగోళం.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ ఆందోళన

JD Vance: యుద్ధ వివరాలపై గందరగోళం.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2026
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన రోజే ఆ దేశ అత్యున్నత నాయకుడు మరణించడంతో,అక్కడి పాలనా వ్యవస్థ కూలిపోతుందని అమెరికా అంచనా వేసింది. తమకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడుతుందని భావించినప్పటికీ, పరిస్థితులు అలా మారలేదు. అమెరికా సైనిక శక్తి ఎదుట ఇరాన్ నిలబడలేదన్నఅంచనాలు కూడా తప్పుగా మారాయి. దీంతో యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈనేపథ్యంలో యుద్ధానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ నుంచి సరిగా చేరడం లేదన్న వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్, సైనిక దళాల ప్రధానాధికారి డాన్‌ కెయిన్ అందిస్తున్న వివరాలపై ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ ఆందోళన వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మాధ్యమాలు పేర్కొన్నాయి.

వివరాలు 

అధ్యక్షుడికి అందుతున్న వివరాలపై అంతర్గత సమావేశం

ఇరాన్ సైనిక శక్తిని గణనీయంగా దెబ్బతీశామని, అమెరికా వద్ద ఆయుధ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని హెగ్సెత్, కెయిన్ చెబుతున్న ప్రకటనలపై వాన్స్ సందేహాలు వ్యక్తం చేశారని సమాచారం. అధ్యక్షుడికి అందుతున్న వివరాలపై జరిగిన అంతర్గత సమావేశంలో వాన్స్ పదేపదే ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా వద్ద కీలక క్షిపణుల నిల్వలు తగ్గిపోతున్నాయన్న వార్తల నేపథ్యంలో, ఈ విషయాన్ని తగ్గించి చూపుతున్నారా అని ఆయన ప్రశ్నించినట్లు వెల్లడైంది.

వివరాలు 

అమెరికాకు ఈ దేశాలతో ఘర్షణలు ఎదురైతే.. 

భవిష్యత్తులో రష్యా, ఉత్తర కొరియా, చైనా వంటి దేశాలతో ఘర్షణలు ఎదురైతే, క్షిపణుల కొరత తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చని ఉపాధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రక్షణాధికారులు అధ్యక్షుడిని తప్పుదారి పట్టించారని నేరుగా ఆరోపించకపోయినా, పరిస్థితులపై తన ఆందోళనలను మాత్రం స్పష్టంగా వెల్లడించినట్లు అంతర్జాతీయ మాధ్యమాల కథనాలు తెలియజేస్తున్నాయి.

Advertisement